మహిళల భద్రతలో తెలంగాణకు అగ్రస్థానం

మహిళలు, పిల్లల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మహిళలు, బాలల భద్రతపై హైదరాబాద్ లో జరిగిన జాతీయ సామాజిక వేత్తల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశంలో మహిళకు ప్రత్యేక స్థానం ఉందని.. వారిని ప్రతి ఒక్కరూ  గౌరవించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మహిళలు లేనిదే సమాజం లేదన్నారు.  అన్ని జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

మహిళలు, చిన్నారుల భద్రత అంశంపై దేశ వ్యాప్తంగా ఉన్న సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అభిప్రాయ సేకరణ చేపట్టింది. వీరి భద్రతకు తీసుకు రావలసిన సంస్కరణలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పోలీసింగ్ విధానాలను కేంద్ర హోంశాఖ దృష్టికి పోలీస్ ఫౌండేషన్ తీసుకువెళ్లనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట పర్యాటక భవన్‌లో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రెన్ జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది. సామాజిక మాధ్యమాలతో పాటు సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నివారణపై ప్రధానంగా చర్చిస్తున్నారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్‌ రెడ్డి, షీ టీమ్స్‌ ఇన్‌ ఛార్జి స్వాతి లక్రా. మహిళలకు భద్రత కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. షీ టీమ్స్‌, భరోసా సెంటర్లతో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సామాజిక వేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులకు అభినందనలు తెలిపారు.