వరల్డ్‌కప్‌లోఅదరగొట్టిన మిథాలీ సేన

మహిళ క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో మిథాలీ సేన అదిరే ఆరంభం చేసింది. ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ ఉమెన్లు రెచ్చిపోవడంతో వన్డేలో రెండో అత్యుత్తమ స్కోర్‌ను భారత్‌ నమోదు చేసింది. బ్యాట్స్‌ ఉమెన్లు, బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌పై భారత్‌ సునాయాసంగా గెలుపు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మెగా టోర్నీలో మిథాలీరాజ్‌ సేన అద్భుత విజయంతో ఆరంభించింది. సమిష్టి ప్రదర్శనతో పటిష్ట ఇంగ్లాండ్‌ను 35 పరుగులతో తేడాతో ఓడించింది.
వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి.. ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌… 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్‌ కాగా… ఇంగ్లాండ్‌పై ఇదే అత్యుత్తమ స్కోర్‌. ఇక ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్‌లు చెలరేగి ఆడటంతో భారత్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ముగ్గురు భారత్‌ బ్యాట్‌ ఉమెన్లు అర్ధశతకాలు చేశారు. మంధన 72 బంతుల్లో 90 పరుగులు, పూనమ్‌ 134 బంతుల్లో 86, మిథాలీ 73 బంతుల్లో 71 పరుగులు చేశారు. మొత్తానికి ఇంగ్లాండ్‌ ముందు భారత్‌ 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ విల్సన్‌ 81 పరుగులతో రాణించింది. ఇంగ్లాండ్‌ గెలుపు కోసం పయనిస్తున్న సమయంలో రనౌట్లు శాపమయ్యాయి. నలుగురు బ్యాట్స్‌ ఉమెన్లు రనౌట్‌ కావడంతో.. ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌ 47.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో భారత్‌ ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తానికి భారత్‌ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించారు. 90 పరుగులు చేసిన స్మృతి నందన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఇక ఈనెల 29న వెస్టిండీస్‌తో మిథాలీ సేన తలపడనుంది.