అక్రమాలపై ఉక్కుపాదం

కల్తీలు, నకిలీలు, జూదం, మోసాలపై ఉక్కుపాదం మోపాలని, వీటి నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జాగీరు భూములను రద్దు చేస్తూ ఆర్ఓఆర్ చట్టంలో కూడా మార్పులు తేవాలని సిఎం సూచించారు. ఇప్పుడున్న చట్టాలకు సవరణలు చేయడంతో పాటు, కొత్త చట్టాలు కూడా రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ చట్టాలపై ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ తేవాలని, వెనువెంటనే అక్రమాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సిఎం స్పష్టం చేశారు. కల్తీలు, నకిలీలు, జూదం, మోసాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నామని,  అయినా అక్కడక్కడ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కల్తీ అవుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. గత ఏడాది కొంతమందిని పట్టుకుని పీడీ యాక్టు ప్రయోగించి జైల్లో వేశామని గుర్తుచేశారు. అయితే, పీడీ యాక్టుకు కూడా కొన్నిసవరణలు చేసి, మరింత కఠినం చేయాల్సి ఉందన్నారు. ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారి ఆట కట్టించేలా చట్టం ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో కల్తీ చేయలేం, చేసినా తప్పించుకోలేం అనే భయం అక్రమార్కుల్లో ఉండేలా చట్టం తేవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికోసం పీడీ యాక్టులో సవరణలు తేవడంతో పాటు, కల్తీ నిరోధానికి ప్రత్యేక చట్టం కూడా తేవాలన్నారు. సీడ్ యాక్టును కూడా కొత్తగా రూపొందించాలని కోరారు.

ఎరువులు, విత్తనాల విషయంలో మోసాలకు పాల్పడే వారిని గుర్తించాలని, వారికి సహకరించే అధికారుల పని పట్టాలని చెప్పారు. ఇందుకోసం వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి’’ అని సిఎం అధికారులను ఆదేశించారు. పోలీస్, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఉండాలన్నారు. ముఖ్యంగా మిర్చి, పత్తి విత్తనాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోందన్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఈ ముఠాలున్నట్లు తేలిందన్నారు. మిగతా ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు.

నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసే వారి పట్ల కూడా అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాంటి ముఠాలను గుర్తించి వారి కార్యకలాపాలను అడ్డుకోవాలన్నారు. వీటిని పూర్తిగా నియంత్రించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా? సవరణలు కావాలా? కొత్త చట్టం రూపొందించాలా? అనే విషయం నిర్ధారించాలని చెప్పారు. అవసరమనుకుంటే వెంటనే కొత్త చట్టం తేవాలి’’ అని సిఎం కోరారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్బులను మూసేశాం. కానీ ఇంకా ఆన్ లైన్ లో తీన్ పత్తి ఆటలు, మరికొన్ని మార్గాల్లో గ్యాంబ్లింగ్ జరుగుతున్నది. దీన్ని పూర్తిగా నిరోధించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవు. గ్యాంబ్లింగ్ నిరోధానికి కొత్త చట్టం తేవాలి. ఈ నెల 17న ఆర్డినెన్స్ తేవడానికి ఏర్పాట్లు చేయండి” అని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సైబర్ నేరాలను అదుపు చేయడానికి అవసరమనుకుంటే కొత్త చట్టం తేవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అమ్మే వారిని గుర్తించాలని, వారిని కూడా కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ‘‘నేరాలను అదుపు చేయడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టాలు తెచ్చుకోవడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఆర్డినెన్స్ వచ్చిన మరుసటి రోజునుంచే టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాలని, తెలంగాణ రాష్ట్రంలో కల్తీలు, నకిలీలు, మోసాలు, గ్యాంబ్లింగ్ కు తావులేదని అందరూ గ్రహించేటట్లు చేయాలని ఆదేశించారు.

జాగీర్ భూముల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  ఈ భూములు రద్దయినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడానికి ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు తేవాలన్నారు. దీనికోసం వెంటనే ఆర్డినెన్స్ తయారు కావాలి’’ అని సిఎం కోరారు.

ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పి.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సి.నర్సింగ్ రావు, రామకృష్ణరావు, సంతోష్ రెడ్డి, పార్థసారథి, శాంతకుమారి, కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.