అంగరంగ వైభవంగా ఓరుగల్లు కళావైభవం

మూడు రోజుల పాటు నిర్వహించిన ఓరుగల్లు కళావైభవం కార్యక్రమం విజయవంతమైంది. చివరి రోజున నిట్ ఆడిటోరియంలో షార్ట్‌ఫిల్మ్‌ల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. షార్ట్‌ఫిల్మ్ రూపకర్తలను ప్రోత్సహించడానికి సినీరంగ ప్రముఖులను జిల్లా యంత్రాంగం ఆహ్వానించింది. అనంతరం విద్యార్థులు, షార్ట్‌ఫిల్మ్ మేకర్స్‌తో ముఖాముఖి నిర్వహించారు. పలువురు విద్యార్థులు సినీప్రముఖులను ప్రశ్నలు సంధించారు.

షార్ట్ ఫిల్మ్ పోటీల్లో వచ్చిన 50 ఎంట్రీల నుంచి ఏడు చిత్రాలను ఫైనల్‌కు ఎంపిక చేశారు. ఆలోచన, నయనం, అయాం ప్రీతి, కొలంబస్, అయాం గిల్టీ, నిశీధి, విశ్వధాభిరామ షార్ట్‌ఫిల్మ్‌లను ఎంపిక చేయగా కొలంబస్, అయాం గిల్టీ, నిశీధి చిత్రాలకు ప్రశంసా పత్రాలు లభించాయి.

ఓరుగల్లు అంటేనే కళలకు పుట్టినిల్లు అని సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. చదువు, సాహిత్యం, సంస్కృతిలో ఇలా అన్ని రంగాల్లోనూ ఓరుగల్లు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నదన్నారు. భవిష్యత్‌లో సినీరంగంలోనూ వరంగల్ గొప్పగా రాణించాలని ఆకాంక్షించారు. మరుగున పడిన కళలను వెలికితీస్తూ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని చాటుకుంటుండటంలో వరంగల్ జిల్లా ప్రధాన భూమిక పోషిస్తున్నదని ఎమ్మెల్యే వినయభాస్కర్‌ తెలిపారు. ఓరుగల్లు కళావైభవం విజయవంతం కావడంపై కలెక్టర్‌ అమ్రపాలి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను పర్యాటకశాఖ తరఫున ఘనంగా సన్మానించారు.