హెచ్1బీ వీసా నిబంధనల సడలింపు!

హెచ్‌1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కొంత ఊరట కల్పించనుంది. ఇప్పటి వరకు ఈ వీసా మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేయాలని భావించినప్పటికీ చిన్న మార్పు దిశగా ఆలోచన చేస్తోంది. సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమ్యాటిక్స్ ల్లో అమెరికా యూనివర్సిటీల నుంచి పి.హెచ్.డి పొందిన విదేశీయులకు సులభంగా హెచ్‌1బీ వీసా అందించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సన్, మైక్ క్విగ్లిలు సభలో బిల్లు కూడా పెట్టారు.

ఈ బిల్లు పాసైతే  భారతీయ విద్యార్థులు లబ్ది పొందనున్నారు. ఎందుకంటే  పెద్ద మొత్తంలో భారతీయ విద్యార్థులు అమెరికాలో పీహెచ్డీలు పొందుతున్నారు. దీంతో వీరందరికీ హెచ్‌1బీ వీసా సులభంగా దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తెచ్చుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని… ఇక్కడ చదువు పూర్తైన విద్యార్థులు తమ ఆర్థిక వ్యవస్థకే ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని కాంగ్రెస్‌ ప్రతినిధులు చెప్పారు.

అత్యుత్తమైన నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో ఎక్కువగా ఖాళీలు ఉంటున్నాయని అమెరికా ప్రతినిధులు తెలిపారు. ఈ కారణంగానే విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డులు, లేదా వీసాలు జారీ చేయడం ద్వారా అవసరమైన వారిని నియమించుకునే అవకాశం ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన విదేశీయులను బయటకు పంపితే దేశ సాంకేతిక, పరిశోధనలను మరింత అభివృద్ధి పరచుకోలేమని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు భావిస్తున్నారు.