స్వాతి తండ్రే నరేష్‌ హంతకుడు

పరువు ముందు ప్రేమ ఓడిపోయింది. పెద్దల కులపిచ్చికి ఓ నిండు జీవితం గాల్లో కలిసిపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మనువాడి సంతోషంగా జీవించాలనుకున్న ఆ యువకుడి ఆశ ఆవిరైంది. వధువు తండ్రి ఘాతుకానికి అతడి నూరేళ్ల జీవితం అర్థాంతరంగా ముగిసింది. పరువు కోసం పాకులాడిన యువతి తండ్రి… ఆ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు, ఆ అమ్మాయి కూడా కొద్ది రోజుల కిందట ఆత్మహత్య చేసుకుంది.

పల్లెర్లకు చెందిన నరేశ్‌… సమీప గ్రామానికి చెందిన స్వాతి కొద్దిరోజులుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో గత ఏప్రిల్ లో నరేశ్‌, స్వాతి… కులాంతర వివాహం చేసుకున్నారు. ముంబైలోని నరేశ్  సోదరి వద్ద కొద్దిరోజులున్నారు. ఆ తర్వాత… స్వాతి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని వారిద్దరూ ముంబై పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారికి రక్షణ కల్పించిన పోలీసులు… స్వస్థలానికి పంపించారు. మరోవైపు, తమ కూతురు కులాంతర వివాహం చేసుకుందని స్వాతి తండ్రి శ్రీనివాస్‌ రెడ్డి కోపంతో రగిలిపోయాడు. కూతురికి మాయమాటలు చెప్పి… భర్త నుంచి దూరం చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ మరుసటి రోజు నుంచి నరేశ్‌ కనిపించకుండా పోయాడు. దీంతో, నరేశ్‌  తల్లిదండ్రులు బాంద్రా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ కనుగొనాలని న్యాయస్థానం… పోలీసులను ఆదేశించారు. అప్పటి నుంచి పోలీసులు నరేశ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే  స్వాతి ఈ నెల 15న ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

మరోవైపు, నరేశ్‌  కనిపించకుండా పోయి రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నరేశ్‌  అదృశ్యం కేసులో శ్రీనివాస్‌ రెడ్డి ప్రవర్తనపై అనుమానం వచ్చి తమదైన రీతిలో విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది. తన కూతురును కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేకే నరేశ్‌ ను హత్య చేశానని శ్రీనివాసరెడ్డి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. మరో ఇద్దరితో కలసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారంతా కలిసి… స్వాతితో నరేశ్‌ కు ఫోన్‌ చేయించారు. రాత్రి సమయంలో ఊరి చివర్లోని వారి పొలం దగ్గరకు రప్పించారు. అనంతరం… స్వాతి ఎదురుగానే రోకలిబండతో తలపై మోది నరేశ్‌ ను దారుణంగా చంపేశారు. తర్వాత అక్కడే టైర్లు వేసి మృతదేహాన్ని కాల్చేశారు.

మరోవైపు, నరేశ్‌ హత్యకు గురయ్యాడన్న విషయం తెలిసి అతడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి సహా పోలీసుల అదుపులో ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అటు, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంతో ఆ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.