స్టాక్ మార్కెట్లోకి 15% పీఎఫ్ పెట్టుబడులు

స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుత రిటర్నుల స్థాయిని సమీక్షించిన అనంతరం ఈటీఎఫ్‌లలో ఈపీఎఫ్‌వో పెట్టుబడి పరిమితిని పది శాతం నుంచి పదిహేను శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. స్టాక్ మార్కెట్లోకి పీఎఫ్ పెట్టుబడులను తొలిసారిగా 2015లో అనుమతించారు పెట్టుబడి పరిమితిని 5 శాతంగా నిర్ణయించారు. 2016లో 10 శాతానికి పెంచారు. తాజాగా మరో ఐదు శాతం పెంచారు. అనుమతి లభించిన తొలి ఏడాదిలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈటీఎఫ్‌లలో రూ.6,577 కోట్లు పెట్టుబడి పెట్టింది. రెండో ఏడాది రూ.14,982 కోట్లు, ఏప్రిల్ 2017తో ముగిసే నాటికి పెట్టుబడులు రూ.22,858.69 కోట్లుగా నమోదయ్యాయి. ఈటీఎఫ్‌లపై రిటర్నుల రేటు 13.72 శాతంగా ఉంది అని దత్తాత్రేయ తెలిపారు.

ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల నుంచి డివిడెండ్ రూపంలో రూ.234.86 కోట్లు ఆర్జించినట్లు ఆయన వెల్లడించారు. ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ద్వారా ఆర్జించిన లాభాలను పీఎఫ్ చందాదారులకు ఎలా పంచుతారన్న ప్రశ్నకు కార్మిక శాఖ కార్యదర్శి ఎం సత్యవతి సమాధానమిస్తూ.. ఈ పథకాల నుంచి బయటికి వచ్చేందుకు ప్రత్యేకంగా ఓ పాలసీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఎగ్జిట్ అయ్యాక వచ్చిన ఆదాయాన్ని చందాదారులందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. ఎగ్జిట్ పాలసీపై ఈ సమావేశంలోనే చర్చించాం. అయితే సభ్యులు మరింత స్పష్టత కోరారు. వచ్చే సమావేశంలో ఈ అంశంపై ఈపీఎఫ్‌వో మరో ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నది అని చెప్పారు.

ఉద్యోగుల కనీస వేతనం నుంచి పీఎఫ్ ఖాతాలో తప్పనిసరిగా జమ చేయాల్సిన సొమ్ము పరిమితిని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనను ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు తిరస్కరించింది. ఉద్యోగులు, కంపెనీ యాజమాన్యాలు, ప్రభుత్వం తరఫున ప్రతినిధులు ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు తెలిపారని, పరిమితిని 12 శాతంగానే కొనసాగించాలని వారు అభిప్రాయపడినట్లు సత్యవతి తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్‌వో ఖాతాలో ఉద్యోగి, కంపెనీ యాజమాన్యం కలిసి కనీస వేతనంలో 12 శాతం చొప్పున సొమ్మును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయిస్ పెన్షన్ ఫండ్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి జమ చేసే 12 శాతం సొమ్ము మొత్తం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. కంపెనీ యాజమాన్యం చెల్లించే సొమ్ములో 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాలోకి, 8.33 శాతం ఈపీఎస్ అకౌంట్‌లో జమవుతుంది. అంతేగాక, యాజమాన్యం మరో 0.5 శాతం సొమ్మును ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీంలో జమ చేయాల్సి ఉంటుంది.