సైన్యం కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటును సమర్ధవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. వేర్వేరు ఎన్ కౌంటర్లలో 8 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పుల్వామా జిల్లాలో ట్రాల్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అందులో హిజ్బుల్ ముజాహిద్దీన్ ముఖ్యనేత సబ్జర్ అహ్మద్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత.. సబ్జర్, హిజ్బుల్ బాధ్యతలు తీసుకున్నాడు.  ఈ కాల్పుల్లో సబ్జర్ తో పాటూ పాకిస్థాన్ కు చెందిన మరో ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది. మరోవైపు రాంపూర్ సెక్టార్ లో కూడా భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో చొరబాటుదారులకు గట్టిగా బుద్ది చెప్పిన సైన్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు ట్రాల్ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది.