శృతిహాసన్ సంచలన నిర్ణయం!

సంఘమిత్ర సినిమా నుంచి శృతిహాసన్ వైదొలిగింది. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని శృతిహాసన్ మేనేజర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. సంఘమిత్ర సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు అంకితభావంతో పనిచేయాలని శృతిహాసన్ భావించింది. తన పాత్రలో శారీరకంగా ఫిట్‌గా కనిపించడానికి విదేశీ నిపుణుల ఆధ్యర్యంలో గత కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నది. ఈ సినిమా పట్ల శృతి హాసన్‌కు ఎంతో ఆసక్తి కనబరిచినప్పటికీ.. ఇప్పటి వరకూ పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ను అందజేయకపోవడం, డేట్స్ విషయంలో స్పష్టత లేకపోవడం..తదితర కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది అని ఈ ప్రకటనలో తెలిపారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించనున్నారు. జానపద కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో పోరాటయోధురాలైన యువరాణి పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఇటీవలే చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో విడుదల చేశారు. త్వరలో చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో శృతిహాసన్ సినిమా నుంచి తప్పుకొని చిత్ర వర్గాలను విస్మయానికి గురిచేసింది.