శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు  

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దేశంలోనే అత్యద్భుతమైన కోవెలగా తీర్చిదిద్దేందుకు శిల్పాచార్యులు, స్థపతులు, ఆర్కిటెక్టులు, ఆగమ పండితులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వచ్చే దసరా నాటికి యాదాద్రి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధంచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచారు.  నిర్దేశిత గడువులోగా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే రెండువేల ఎకరాల భూసేకరణ పూర్తయింది.

వందలాది మంది శిల్పులు నరసింహస్వామి అవతార మూర్తులను తీర్చిదిద్దుతున్నారు. బాలపాదం, సింహపాదం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. శ్రీకాళహస్తి తరహాలో రాజగోపురం కోసం 35 అడుగుల రాతిపునాదిని నిర్మిస్తున్నారు. స్థపతులు, ఆర్కిటెక్టులు, యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్ జి.కిషన్‌రావు ,.. ఇప్పటికే శ్రీరంగం, శ్రీవెల్లిబుత్తూరు, మదురై మీనాక్షి, కంచి కామాక్షి, వరదరాజస్వామి ఆలయాల రాజగోపుర నిర్మాణాలపైన, ఉత్తర భారతంలోని దేవాలయాల నిర్మాణాలపైన అధ్యయనాలు చేసి నివేదికలను సిద్ధం చేసుకున్నారు.

ఈ నిర్మాణాలన్నింటికీ సరిపోలేవిధంగా యాదాద్రిలో నూతన నరసింహ శిల్పాకృతులు దర్శనమివ్వనున్నాయి. అష్టాదశ పురాణాలతో స్వామిని వర్ణించిన విధంగా 32 రకాల నృసింహ మూర్తులను తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ముఖమండపం కోసం యాదాద్రి క్షేత్రంలోనే శిల్పులు నిర్విరామంగా పనిచేస్తున్నారు.