విద్యుత్ సంస్థల్లో రెగ్యులరైజేషన్‌కు రంగం సిద్ధం

తెలంగాణ విద్యుత్ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించిన కీలక సమావేశాలు ముగియడంతో త్వరలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముగించేలా చర్యలు తీసుకున్నారు.  టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ బోర్డు సమావేశాలు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా ఆమోదించాయి.

ప్రస్తుతం  24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు   ఉంటారని అధికార వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉన్నదని, త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు దరఖాస్తులను ఆహ్వానించారు. 23,667 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు సంస్థల సమావేశంలో ఆయా దరఖాస్తులను పరిశీలించి స్క్రూటినీ చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. క్రమబద్దీకరణ మార్గదర్శకాలు, విధి విధానాలను కూడా రూపొందించి బోర్డు సమావేశాల్లో ఆమోదించారు. ఈ విధి విధానాలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజ్ చేయనున్నారు.

రెగ్యులరైజేషన్‌ విధి విధానాలను రూపొందించారు. దరఖాస్తు చేసుకున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆయా విద్యుత్ సంస్థలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేరిననాటి వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. సదరు ఉద్యోగి వయస్సు 18 ఏండ్ల లోపుగానీ, 58 సంవత్సరాలపైబడిగానీ ఉండకూడదు. కట్ ఆఫ్ డేట్‌ను 4.12.2016గా నిర్ణయించారు. ఆ తేదీనాటికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండాలి.  హైలీ స్కిల్డ్ ఉద్యోగులు ఇంజినీరింగ్, లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రేయినింగ్ ద్వారా పొందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, అలాగే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు.  ఇతర రాష్ర్టాల్లోని యూనివర్సిటీల పరిధిలో, ఇతర రాష్ర్టాల్లో ఉన్న స్టడీ సెంటర్ల నుంచి పొందిన డిగ్రీలను పరిగణనలోకి తీసుకోరు. బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలతోపాటు కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఆఫీస్ అటోమేషన్  పూర్తిచేసి ఉండాలి. స్కిల్డ్ ఉద్యోగుల విద్యార్హతలు  ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి సర్టిఫికెట్‌తోపాటు ఐటీఐ చేసి ఉండాలి. డ్రైవర్‌లు అయితే తెలుగు లేదా ఉర్దూను చదవి, రాయగలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.  అన్‌స్కిల్డ్ ఉద్యోగులకు  ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. స్థానికుడని ఎమ్మారో నుంచి స్థానికత సర్టిఫికెట్ పొందాలి. తెలంగాణ రాష్ట్రం స్థానికత ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఇతర రాష్ర్టాల్లో చదివినా పరిగణనలోకి తీసుకుంటారు. స్పౌజ్ ఆంధ్రప్రదేశ్‌కు, ఇతర రాష్ర్టాలకు చెందినవారు అయితే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుతం ఔట్‌సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తూ.. ఈపీఎఫ్ పరిధిలోకి రానివారిని పరిగణనలోకి తీసుకోరు. అయితే 4.12.2016 నాటికి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కన్సాలిడేట్ పే కింద పనిచేస్తూ ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేయనివారు.. ఈపీఎఫ్ పరిధిలో ఉన్నప్పటికీ పరిగణనలోకి తీసుకోరు. విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటులో భూనిర్వాసితులైనవారు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉంటే వారినికూడా పరిగణనలోకి తీసుకోరు. ఆర్డర్ టు సర్వ్ కింద తెలంగాణ స్థానికత ఉండి, ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటే వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైనమేరకు వెరిఫికేషన్ చేస్తారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించి అప్‌లోడ్ చేసిన వివరాలు   క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సదరు విద్యుత్ సంస్థ నియమించిన కమిటీ ఈ వివరాలు  పరిశీలిస్తుంది. 2016అక్టోబర్/నవంబర్ లో ఇచ్చిన జీతభత్యాలు, అందులోంచి ఈపీఎఫ్/ఈఎస్‌ఐ మినహాయింపులు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్థానికతపై తహసీల్దారు ఇచ్చిన సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్, బయోడాటా వివరాలపై ఫీల్డ్ ఆఫీసర్ ఇచ్చిన ధ్రువీకరణపత్రం తదితర సమాచారాన్ని పరిశీలిస్తారు.