రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళన

రిజిస్ట్రేషన్ల శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు సీఎం కేసీఆర్. అక్రమాలు, అవినీతికి ఆస్కారం లేకుండా  పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో దశాబ్దాలుగా పేరుకుపోయిన మకిలిని సీఎం కేసీఆర్ సమూలంగా కడిగిపారేస్తున్నారు. చిన్నపాటి అవకతవక జరిగినా సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ లోని మియాపూర్ లో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ర్టేషన్  వ్యవహారాన్ని సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ విషయంలో ఎంత వేగంగా స్పందించారో.. అంతే స్పీడుతో మేడ్చల్, కూకట్ పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురి ఇళ్లలోనూ ఏసీబీ మెరుపు దాడులు చేసింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు రిజిస్ట్రేషన్ల శాఖపై సుదీర్ఘ సమీక్ష చేసిన సీఎం.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. నిన్న 29 మందిని ట్రాన్స్ ఫర్ చేయగా.. ఇవాళ మరో 43 మంది బదిలీ చేశారు. మొత్తం 72 మందికి స్థాన చలనమయింది. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదుకు 29 మంది ట్రాన్స్ ఫర్ మీద వచ్చారు.

ఇప్పటికే ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. చిన్నపాటి అవినీతి జరిగినా నిమిషాల్లో అధికారులపై క్రిమినల్  కేసులు పెట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. బినామీ పేర్ల మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించిన వారితో కుమ్మక్కైన అధికారులు వాటిని అప్ లోడ్ చేయడం లేదు. ఆ విషయం సీఎం దృష్టికి వచ్చింది. దాంతో రాష్ట్రంలోని 141 రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకబిగిన ఏసీబీ దాడులు జరిగాయి. అప్ లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరించి, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.

ఒక్క రూపాయి కూడా  లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ జరిగేలా ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తోంది. డబ్బులిస్తేనే తప్ప రిజిస్ట్రేషన్ కాదనే అభిప్రాయాన్ని పోగొట్టేందుకే రిజిస్ట్రేషన్ల శాఖను సీఎం కేసీఆర్ సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు.