రాష్ట్రంలో భారీ వర్షాలు  

ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో  ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పదుల సంఖ్యలో చెట్లు, కరెంట్  స్థంభాలు నేలకూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కరెంట్  సరఫరాకు అంతరాయం కలిగింది. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూరు, ఇచ్చొడలో వర్షం కురిసింది. నిర్మల్‌  జిల్లా దిలావర్‌ పూర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కడెం మండలం పాండవాపూర్‌, కొందుకూరులో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. మామడ, లోకేశ్వరం, నిర్మల్‌ టౌన్‌ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు చోట్ల ఇండ్ల  పైకప్పులు ఎగిరిపోయాయి. ఇక కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోనూ అకాల వర్షం రైతులకు నష్టం కలిగించింది. సారంగపూర్, కడెం, కుంటాల మండలాల్లో రైతులు కొనుగోళ్లకు తెచ్చిన పంట పూర్తిగా తడిసిపోయింది.

ఇటు వికారాబాద్‌ జిల్లాలోనూ అకాల వర్షం భీభత్సం సృష్టించింది. తాండూరులో భారీ వర్షం కురిసింది. కొడంగల్‌  మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. కొడంగల్ లో చెట్లు విరిగిపడ్డాయి. బోంరాస్ పేట మండలంలో ధాన్యం తడిసింది, కంచకచర్ల మండలం ఇప్పాయిపల్లిలో పిడుగుపాటుకు ఓవ్యక్తి మృతి చెందాడు.  జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం, రామన్నపేట మండలంలో ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. శోభనాద్రిలో 15 ఇండ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌, ఆత్మకూరు మండలాల్లో వర్షం కురిసింది.

ఇక  జయశంకర్ భూపాల పల్లి జిల్లా కేంద్రంలో.. ములుగు , వెంకటాపురం గోవిందరావుపేట మండలాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.  వరంగల్ పట్టణ కేంద్రలోనూ ఓ మోస్తరు వర్షం పడింది. . నిజామాబాద్‌ సిటీ, బాల్కొండ, డిచ్‌పల్లి, బోధన్‌, వర్నిలో ఈదురుగాలులలతో కూడిన వర్షం కురిసింది.

రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజ్ గిరీ, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వర్షం పడింది..జగిత్యాల జిల్లా మల్లాపూర్ మార్కెట్ యార్డ్ కోనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిముద్దైంది. అటు పెద్దపల్లి జిల్లాలోను వర్షం భీభత్సం సృష్టించింది. ధర్మారం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన  వర్షం పడింది.

ఇక హైదరాబాల్ లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సనత్‌ నగర్‌లో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, మారేడ్ పల్లితో పాటు సంతోష్ నగర్, చత్రినాక, లాల్ ధర్వాజ, చంపాపేట్, సైదాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.  ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీగా చెట్లు నేలకూలాయి,  అటు పాతబస్తీలోని హూస్సేనీ ఆలం, బహదూర్ పూర, దూద్ బౌలీ, పురాణాపూల్, కాలాపత్తర్ లలో వర్షం కురిసింది. ఈదురుగాలులు భారీగా వీయడంతో పలు ప్రాంతాల్లో విధ్యుత్ కు అంతరాయం ఏర్పడింది..నాంపల్లి, సోమాజీగూడ లో రోడ్లన్ని జలమయమయ్యాయి.