మామే నరేష్ హంతకుడు!

ఈ నెల 2న భువనగిరిలో మిస్సయిన అంబోజు నరేష్ కేసుని రాచకొండ పోలీసులు ఛేదించారు. నరేష్ మామ శ్రీనివాసరెడ్డి అతన్ని చంపినట్టు ఒప్పుకున్నాడని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ముందు నుంచి శ్రీనివాసరెడ్డిపై అనుమానం ఉందని, విచారణలో ఇది రుజువయ్యిందని చెప్పారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఆయన విలేకరులకు కేసు విచారణ వివరాలు తెలిపారు.

ఈ నెల (మే) 2 న అంబోజు నరేష్, అతని భార్య స్వాతి భువనగిరి వచ్చారని, స్వాతి పిన్ని కొడుకు నల్లా సత్తిరెడ్డి కారులో ఇంటికి వెళ్లిందని మహేష్ భగవత్ చెప్పారు. ఆ రోజు నుంచి నరేష్ కనిపించడం లేదన్నారు. ఈ నెల 6న నరే ష్ కనిపించడం లేదని అతని బంధువులు భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో విచారణకు స్వాతి తండ్రిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో మనస్తాపంతో ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ఆమెకు వైద్యం చేయించి ఇంటికి తీసుకెళ్లారని, తిరిగి ఈ నెల 16న స్వాతిని ఓ విలేకరి ప్రశ్నించిన తీరుపై ఆమె మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీపీ వివరించారు. పోస్టుమార్టంలో ఆమె ఒక నెల గర్భవతి అని తేలిందని చెప్పారు.

ఈ నెల 18న నరేష్ తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, కోర్టు ఆదేశం మేరకు ఎల్బీ నగర్ డీసీపీ వెంకటేశ్వరరావుని విచారణ అధికారిగా నియమించామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 22 న విచారణ ప్రారంభం అయ్యిందని, ఆరు బృందాలను ఏర్పాటు చేసి నరేష్ స్వగ్రామం పల్లెర్ల, స్వాతి స్వగ్రామం లింగరాజుపల్లితో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గాలించామన్నారు.

ఈ నెల 2న రాత్రి స్వాతి ఇంటి చుట్టూ ఓ వ్యక్తి బైక్ పై తిరుగుతుంటే ఆమె పిన్ని కొడుకు సత్తిరెడ్డి గుర్తించి అడిగాడని, నరేష్ ని పొలంలో ఉన్న బావి దగ్గరకి బైక్ పై తీసుకెళ్లాడని సీపీ భగవత్ తెలిపారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి కూడా ఇనుప రాడ్ తీసుకొని బావి దగ్గరికి వెళ్లాడని చెప్పారు. అక్కడ నరేష్ తో సత్తిరెడ్డి మాట్లాడుతుంటే శ్రీనివాసరెడ్డి వెనుక నుంచి నరేష్ మెడపై కొట్టాడని, ఒక్కదెబ్బకే నరేష్ చనిపోయాడని వివరించారు. అక్కడ ఉన్న కంది కట్టెపై నరేష్ శవం పడేసి కాల్చారని, ఐతే శవం పూర్తిగా కాలకపోవడంతో సత్తిరెడ్డి ఆత్మకూరు వెళ్లి పెట్రోల్, టైర్లు తీసుకొచ్చాడని, నరేష్ శవాన్ని టైర్లపై వేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని వెల్లడించారు. అదే రాత్రి దగ్గరలో ఉన్న మూసీ నదిలో నరేష్ అస్థికలు, బూడిద కలిపారని చెప్పారు.

మొదట ఆత్మహత్య యత్నం చేసిన స్వాతి రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో వివరాలు తేల్చాల్సి ఉందని సీపీ భగవత్ చెప్పారు. ఆమె సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిందా లేకుంటే ఎవరైనా చేశారా అనేది నిర్ధారించడానికి రెండు వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామన్నారు.

మార్చి 23న నరేష్, స్వాతి పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో స్వాతి కుటుంబం దాన్ని అంగీకరించలేదు.