భూసేకరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

కీలకమైన ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించే కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో ఒక స్పష్టమైన విధానమే లేకుండా పోయింది. ప్రభుత్వం పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ చేపడుతూ ఉంటే.. రైతుల్ని రెచ్చగొట్టి, ఆటంకాలు సృష్టిస్తూ, రాజకీయ ప్రయోజనం పొందేందుకు టీ-కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉంది. పాలమూరు-రంగారెడ్డి మొదలు మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సృష్టిస్తున్న ఆటంకాలు అన్నీఇన్నీ కావు. రైతుల సమ్మతి లేకుండా భూసేకరణ చేపట్టవద్దని, సామాజిక ప్రభావ అంచనాను పరిగణలోకి తీసుకోకుండా భూములు సేకరించవద్దని 2013 నాటి చట్టాన్ని ఉటంకిస్తూ ధర్నాల వరకూ వెళ్లింది.

రైతుల సమ్మతి శాతాన్ని 70 నుంచి 50శాతానికి తగ్గించాలని, సామాజిక ప్రభావ అధ్యయనం నుంచి భూసేకరణకు పూర్తి మినహాయింపు ఇవ్వాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. యూపీఏ రూపొందించిన భూసేకరణ మూల చట్టానికి ఎలాంటి సవరణలు వద్దంటూ తెలంగాణలో కాంగ్రెస్ పట్టుబడుతుండగా, కర్ణాటకలో మాత్రం సవరణలు లేకపోతే ఏ ప్రాజెక్టుకూ భూసేకరణ సాధ్యమే కాదని అంటోంది. యూపీఏ హయాంలో రూపొందిన 2013 భూసేకరణ చట్టానికి స్వల్ప సవరణలు చేస్తూ మోదీ ప్రభుత్వం సవరణల బిల్లును ప్రతిపాదిస్తే మూల చట్టానికి మార్పులు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని రాజ్యసభలో కాంగ్రెస్ అడ్డుకుంది. ప్రైవేటు ప్రాజక్టులకైతే భూమిని కోల్పోతున్న రైతుల్లో 80% మంది, ప్రభుత్వ ప్రాజెక్టులకైతే 70% మంది సమ్మతి ఉండి తీరాల్సిందేనని కాంగ్రెస్ వాదించింది. దీన్ని తగ్గించే విధంగా ఐదు ప్రాధాన్య రంగాలకు చెందిన ప్రాజెక్టులకు మినహాయింపు ఇస్తూ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సవరణకూ అడ్డు తగిలింది.

ఎన్డీయే.. చివరకు ప్రతిపక్షాల డిమాండ్ కారణంగా సంయుక్త పార్లమెంటరీ బృందం అధ్యయనం కోసం బిల్లును పంపక తప్పలేదు. దీనిపై అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ సంవత్సరకాలంగా సమావేశమే జరుపలేదు. ఏడాది విరామం తర్వాత జరిగిన ఈ కమిటీ సమావేశానికి కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ తరఫున అధికారులు హాజరై భూసేకరణలోని చేదు అనుభవాలను వివరించారు. ఆటంకంగా మారిన 2013 నాటి చట్టంలోని కఠిన నిబంధనలను సవరించాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. 2014 జనవరి నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం 47,595 ఎకరాల లక్ష్యానికి గాను ఒకే ఒక్క ఎకరాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోగలిగామని, వివిధ కారణాలతో సాధ్యమే కాలేదని పేర్కొన్నది. విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, గృహ నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, విద్యుత్ ప్రాజెక్టులు తదితరాలకు సామాజిక ప్రభావ అంచనా నిబంధన నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరింది. లేకపోతే భూసేకరణ సాధ్యమే కాదని వ్యాఖ్యానించింది. అదే విధంగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణమయ్యే ప్రాజెక్టులకు ఆ ప్రాంతంలో భూమిని కోల్పోయే రైతుల్లో 70% మంది సమ్మతి తీసుకోవాలన్న మూల చట్టంలోని నిబంధన కూడా ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. 50% సమ్మతి ఉంటే సరిపోతుందని సవరణ చేయాలని కోరింది.

భూసేకరణ మూల చట్టానికి సవరణలు చేయాలని ఎన్డీఏ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో, ఒక దశలో రాష్ర్టాలు పడే తలనొప్పి తమకెందుకనే ఉద్దేశంతో ఆ బిల్లు నుంచి దాదాపుగా పక్కకు తప్పుకుంది. దీంతో గుజరాత్, తెలంగాణ లాంటి రాష్ర్టాలు సొంతంగా చట్టాలు చేసుకున్నాయి. ప్రభుత్వం భూసేకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. బిల్లుకు ఆమోదం లభించకుండా విశ్వ ప్రయత్నాలు చేసింది. తగిన నష్టపరిహారం చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించింది. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ వైఖరికి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమని సమాధానం చెప్తారో మరి..! కర్ణాటకలోనూ రైతు వ్యతిరేక ప్రభుత్వమే ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? ఈ ఆంక్షల సడలింపును డిమాండ్ చేసే కర్ణాటక కాంగ్రెస్ వైఖరిని తెలంగాణ కాంగ్రెస్ సమర్ధిస్తుందా.. ఆనేది ఆ పార్టీనే స్పష్టం చేయాలి. లేనిపక్షంలో కేవలం స్వార్థప్రయోజనాల కోసమే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని కాంగ్రెస్ అవలంబిస్తున్నదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.