భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలను సహించం

భూముల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలను సహిచేంది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంగుళం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది. హైదరాబాద్ కూకట్ పల్లి అక్రమ భూ రిజిస్ట్రేషన్‌పై సీరియస్ అయిన సర్కారు.. ఆ లావాదేవీలన్నీ రద్దు చేసింది. దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధికారులతో  డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌పై సమీక్ష జరిపారు. కూకట్ పల్లి రిజిస్ట్రార్ కార్యాయలంలో జరిగిన అక్రమాలపై అధికారులతో చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన 810 ఎకరాల భూ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. బాధ్యులైన అధికారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. భవిష్యత్ లో కూకట్ పల్లి లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌, ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వక్ఫ్, దేవాదాయ, ఇతర ప్రభుత్వ భూముల లావాదేవీలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని మహమూద్ అలీ సూచించారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అలర్ట్ గా ఉండి, అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ లో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్‌ లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవకతవకలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు విడుదల చేశారు. అధికారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. లావాదేవీలన్నీ సవ్యంగా జరుగుతున్నాయో లేదో చూడాలని చెప్పారు. పర్యవేక్షణాధికారులు కిందిస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు.

1908 క్రమబద్దీకరణ చట్టం ప్రకారం భూముల లావాదేవీలు సవ్యంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధికారులకు సూచించారు. పర్యవేక్షణాధికారులు అవకతవకలు జరిగాయో లేదో.. బుక్‌ 1, బుక్‌ 4 ఆధారంగా తెలుసుకోవాలన్నారు. రికార్డు రూములను సజావుగా నిర్వహించి.. మార్గదర్శకాల ప్రకారం డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ అధికారులు తమ రోజు వారీ పరిపాలనా విధుల్లో.. ఎలాంటి అవకతవకలకు పాల్పడొద్దని సూచించారు. అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని మహమూద్ అలీ హెచ్చరించారు.