భూమిలేకుండానే 810 ఎకరాల రిజిస్ట్రేషన్!

ఉమ్మడి రాష్ట్రంలో పురుడుపోసుకున్న ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం మాయాబజార్ సినిమాను తలపిస్తున్నది. ఉన్నవిలేనట్టు.. లేనివి ఉన్నట్టుగా.. చిన్నవి పెద్దగా.. పెద్దవి చిన్నగా మార్చేసి.. కనికట్టు చేసి.. పట్టాలు పుట్టిస్తున్నది! తాజాగా ఓ పెద్ద మాయగాడు ఏకంగా 810 ఎకరాల లేని భూమిని రిజిస్టర్ చేశాడు! ఈ పాపంలో ఒక రిజిస్ట్రార్ పాలుపంచుకున్నాడు.. ఇంత భూమికి స్టాంప్‌డ్యూటీ కూడా భారీగానే ఉంటుంది! మార్కెట్ రేటులో నాలుగు శాతం చొప్పున కనీసం ఆరు వందల కోట్లు చెల్లించాలి! అసలే లేని భూమి అని కనికరించాడేమో ఒక్కో డాక్యుమెంటుకు లక్ష రూపాయల స్టాంప్‌డ్యూటీతో మమ అనిపించేశాడు! దిమ్మతిరిగే ఈ నకిలీ పట్టాల కనికట్టు చోటుచేసుకుంది మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో! ఈ బోగస్ ఉదంతం మూలాలు, పన్నాగాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.

మార్కెట్ రేటు ప్రకారం సుమారు పదివేల కోట్ల రూపాయలు ఉన్న 810 ఎకరాల భూమిని.. కేవలం కాగితాలపైనే చూపితే.. ఓ అవినీతి రిజిస్ట్రార్ ఎంచక్కా వాటికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు జారీ చేశాడు. ఏడాది క్రితం చోటు చేసుకున్న ఈ ఉదంతంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ జరిపిన అధికారులు.. లేని భూమికి రిజిస్ట్రేషన్ జరుపడం వాస్తవమేనని నిగ్గుదేల్చారు. వెంటనే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ల్యాండ్ మాఫి యా సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 101, 20, 28, 100, 45, 44 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 810.26 ఎకరాల భూమి ఉన్నట్లు ల్యాండ్ మాఫియా సభ్యులు నకిలీ రికార్డులను సృష్టించారు. ఈ ప్రాంతంలో భూమి మార్కెట్ ధర చదరపు గజానికి రూ.25వేల నుంచి రూ. 30వేల వరకూ ఉంటుంది. ఈ లెక్కన 810.26 ఎకరాల భూమి విలువ అటూఇటూగా పదివేల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. వాస్తవానికి అక్కడ ఎలాంటి భూమీ లేదు. కానీ వందల ఎకరాల పైగా భూములున్నాయని, అవి తమకు నిజాం సర్కార్ ఇచ్చిందని పేర్కొంటూ, దాని నక్షాను కూడా ప్రస్తావిస్తూ రఫీయుద్దీన్‌ఖాన్ భార్య అమీరున్నీసాబేగం, సల్మాన్ అహ్మద్ భార్య ఫక్రున్నీసాబేగం, ఎండీ బషీరుద్దీన్ భార్య మాసరతున్నీసాబేగం, రఫీయుద్దీన్‌ఖాన్ కుమారుడు ఎండీ ముషాహిద్దీన్‌ఖాన్, ఎండీ ఖైసరుద్దీన్‌ఖాన్ కుమారుడు ఎండీ ఫసియుద్దీన్‌ఖాన్, ఎండీ ఖైసరుద్దీన్‌ఖాన్ కుమారుడు ఎండీ జకీయుద్దీన్‌ఖాన్, ఎండీ ఖైసరుద్దీన్‌ఖాన్ కుమారుడు ఎండీ ఇజాజ్‌ద్దీన్‌ఖాన్, ఎండీ ఖైసరుద్దీన్‌ఖాన్ కుమారుడు ఎండీ ఖరీముద్దీన్‌ఖాన్‌ల పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. వీరు ఎవరు? ఎక్కడుంటారు? అనే విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఆరుగురు వ్యక్తులు 810.26 స్థలంపై తనకు జీపీఏ ఇచ్చారని ట్రినిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధిగా పేర్కొంటూ మాసబ్‌ట్యాంక్‌లో నివసించే పీఎస్ పార్థసారథి అనే వ్యక్తి వచ్చాడు. గాంధీనగర్‌లో నివసించే సువిశాల్ పవర్ జన్ లిమిటెడ్‌కు చెందిన పీవీఎస్ శర్మకు ఈ భూమిని విక్రయించినట్లుగా కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశాడు. వాస్తవానికి మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధి మూసాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోకి వస్తుంది. కానీ ఈ అక్రమ వ్యవహారం మూసాపేట్ కార్యాలయంలో కుదరదని భావించిన ల్యాండ్ మాఫియా సభ్యులు తెలివిగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఈ విధానంలో ఒక జిల్లాలో ఉన్న ప్రజలు అదే జిల్లాలో ఏ ప్రాంతంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా చర, స్థిర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించి, 2016 జనవరిలో లేని భూములను నకిలీ కాగితాలపై చూపుతూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏడాదిన్నర కిందట ఈ ఒక్కటే జరిగిందా? లేక ఇంకేమైనా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయా అనే కోణంలోను అధికారులు విచారణ మొదలుపెట్టారు.

పదివేల కోట్ల రూపాయల విలువైన భూమిని కాగితాలపై సృష్టించి.. ఆ పత్రాలను బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందారా? అన్న విషయంలో పోలీసులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా ఖాళీ భూమి ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నైట్లెతే వారు ఆ భూమిపై క్రయవిక్రయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ భూమి లేకున్నా లక్షలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వెనుక రుణాలు పొందడం అనే కుట్రే దాగి ఉంటుందన్న అభిప్రాయాన్ని రిజిస్ట్రేషన్ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.

లేని భూమిని రిజిస్టర్ చేసిన వ్యవహారం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ సైదిరెడ్డి విచారణ నిర్వహించి కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల విచారణతో పాటు పోలీసుల విచారణ సైతం కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ ఉదంతంలో భాగస్వాములుగా భావిస్తున్న కూకట్‌పల్లి ల్యాండ్ మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. నకిలీ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసిన వ్యవహారంపై వేగవంతమైంది.