బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దక్షిణ కోల్ కతాకు 900 కిలోమీటర్లు, చిట్టగాంగ్ కు 890 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. నాగర్ కర్నూలులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ఇంటి పైకప్పులు లేచిపోయాయి. అటు ఆదిలాబాద్ పట్టణంలో కూడా వర్షం కురిసింది.