బంగాళాఖాతంలో అల్పపీడనం

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం తగ్గడంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు చోట్ల వర్షం పడే అవకాశాలున్నాయి. ఆకాశంలో మబ్బులు ఏర్పడుతుండటంతో ఎండతీవ్రత తగ్గి.. తెల్లవారు జామున చలిగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉందని వాతావరణం శాఖ స్పష్టం చేసింది. దీంతో కేరళలోని దక్షిణ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు ఈ నెల 31లోపు తాకే అవకాశం ఉందని వెల్లడించింది. కన్యాకుమారి సమీపంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతిరుతుపవనాలు ముందుకు కదిలాయని తెలిపింది. దీని ప్రభావంతో ఈ ఏడాది భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ఇక గత రెండు రోజులుగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి.