ప్రియాంకకు మరో అరుదైన గౌరవం

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత్‌కు అంతర్జాతీయ ప్రతీకగా నిలిచినందుకు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. కొత్తగా ప్రవేశపెట్టిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి విభాగంలో హాలీవుడ్ సినిమా బేవాచ్‌లో నటించిన ప్రియాంకచోప్రా త్వరలో ఈ అవార్డును అందజేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ తరఫున ప్రియాంక చోప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పని తీరుతో దేశం గర్వించేలా చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డుకు ఆమెను ఎంపిక చేశాం అని దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ, అవార్డు కమిటీ చైర్మన్ గణేశ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో జానీ లివర్, పహ్లజ్ నిహ్లానీ, మిథున్ చక్రవర్తి, టీపీ అగర్వాల్ తదితరులు ఉన్నారు. వచ్చే నెల 1న ముంబైలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు అనిల్ కపూర్, కపిల్‌శర్మ, జూహ్లీ చావ్లా, నితేశ్ తివారి తదితరలు హాజరుకానున్నారు.