పీసీబీతో సమావేశాలు అనవసరం

ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో చర్చలు జరుపాల్సిన అవసరం బీసీసీఐకి లేదని కేంద్ర క్రీడాశాఖమంత్రి విజయ్ గోయెల్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతించకుండా రెండుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు కొనసాగవన్న విషయాన్ని తెలుసుకోవాలంటూ బీసీసీఐ అధికారులకు చురకలంటించారు. ఇటీవల దుబాయ్‌లో పీసీబీ అధికారులతో బీసీసీఐ సమావేశమవడాన్ని కూడా గోయెల్ తప్పుపట్టారు. పాక్‌తో ఇంకా ఎందుకు భేటీ అవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. “సీమాంతర ఉగ్రవాదం నిలువరించేవరకు పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా పీసీబీతో వారు ఎందుకు చర్చలు జరుపుతున్నారో తెలుసుకోవాల్సి ఉంది” అని మంత్రి గోయెల్ వ్యాఖ్యానించారు.