పశువుల అమ్మకాలపై ఆంక్షలు

ప‌శువ‌ధను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వశాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పశువుల అమ్మ‌కాల‌పై కూడా కొన్ని నియంత్ర‌ణ‌లు విధించింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌శువుల‌ను కేవ‌లం వ్య‌వ‌సాయ ప‌నుల కోసమే అమ్మడానికి తీసుకొచ్చామ‌ని, వాటిని ప‌శు వ‌ధశాల‌ల‌కు అమ్మ‌డం లేద‌ని రైతులు లిఖిత‌పూర్వ‌కంగా రాసిస్తేనే వాటిని ప‌శువుల సంతలో అమ్మ‌కానికి అనుమ‌తినిస్తారు. దీనిని ప‌శువుల మార్కెట్ క‌మిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ప‌శువుల‌ను కొనుగోలు చేసేది కూడా ఒక రైతేన‌ని అత‌ని ద‌గ్గ‌ర ఉండే ప‌త్రాల‌ను చూసి అధికారులు ధృవీక‌రిస్తారు. కొనుగోలుదారు వాటిని ప‌శు వ‌ధ‌శాల‌కు అమ్మ‌బోన‌ని లేదా వాటిని ఏ మ‌త విశ్వాసాల‌కు అనుగుణంగా బ‌లి ఇవ్వ‌బోన‌న్న హామీ ఇవ్వాల్సి ఉంటుంద‌ని కూడా ఈ గెజిట్ నోటిఫికేష‌న్ స్ప‌ష్టం చేసింది.

ఇక్క‌డ పశువులు అంటే ఎద్దులు, ఆవులు, బ‌ర్రెలు, ఒంటెలు, దూడ‌లు, కోడెలు అని నోటిఫికేష‌న్ లో పేర్కొన్నారు. అనుమ‌తి లేకుండా పక్క రాష్ట్ర వ్యక్తి ప‌శువుల‌ను కొనుగోలు చేయ‌డంపై కూడా నిషేధం విధించింది ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌. రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌కు 25 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ప‌శువుల మార్కెట్లు ఉండ‌కూడ‌ద‌ని కూడా ఆదేశించింది. ఇక గోశాల‌లు, ఇత‌ర ప‌శుసంర‌క్ష‌ణ శాల‌లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ప‌శువుల‌ను ద‌త్త‌త‌కు ఇచ్చే ముందు కూడా వాటిని ప‌శువ‌ధ‌శాల‌ల‌కు అమ్మ‌డం లేద‌ని రాసివ్వాల్సి ఉంటుంది. అయితే, ఇది రాష్ట్రాల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో ప‌శువ‌ధ‌ను కేంద్రం ఎలా నిషేధిస్తుంది, నియంత్రిస్తుంద‌న్న దానిపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.