పల్లెటూరి అమ్మాయిగా మనాలి!

సృజనశీలి వంశీ దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ చిత్రం తన కెరీర్‌లో గొప్ప మలుపుగా నిలుస్తుందని చెప్పింది మనాలి రాథోడ్. ఆమె కథానాయికగా సుమంత్ అశ్విన్ సరసన నటించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకులముందుకురానుంది. మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా మనాలి మీడియాతో ముచ్చటించింది. “నేను నటిస్తున్న నాలుగో చిత్రమిది. ఇందులో నేను అమ్ములు అనే అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపిస్తాను. చిలిపి సరదాలతో నా పాత్ర సాగుతుంది. అభినయానికి మంచి ప్రాధాన్యత వున్న పాత్ర ఇది. దర్శకుడు వంశీ కథానాయికల్ని అందంగా, తెలుగుదనం ఉట్టిపడేలా ఆవిష్కరిస్తారు. నేను పోషిస్తున్న అమ్ములు పాత్ర కథాగమనంలో కీలకంగా వుంటుంది. ఆమె వల్లే కథలో ముఖ్యమైన మార్పు సంభవిస్తుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. వంశీ నుంచి ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నాను. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం హౌరా బ్రిడ్జ్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది” అని చెప్పింది.