పద్నాలుగేళ్ల తర్వాత పట్టా అందుకున్నాడు!

ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌ బర్గ్ మొత్తానికి డిగ్రీ పట్టా అందుకున్నారు. తాను చదివిన హార్వర్డ్ యూనివర్సిటీలో 13 ఏళ్ల తర్వాత అడుగుపెట్టారు. 2004 లో ఆపేసిన చదువును ఆయన ఇటీవలే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆయనకు డిగ్రీ పట్టాను ప్రధానం చేసింది. 13 ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టాను పొందటం ఎంతో సంతోషంగా ఉందని జుకర్‌ బర్గ్ చెప్పారు.

డిగ్రీ పట్టా అందుకున్న స్నాతకోత్సవంలో జుకర్ బర్గ్‌ ముఖ్య అతిథిగా ప్రసంగించటం విశేషం. తాను చదివిన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసే అరుదైన గౌరవాన్ని మార్క్ దక్కించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లకు జుకర్‌ బర్గ్‌ చక్కని సలహాలు, సూచనలు చేశారు. కొత్త సవాళ్లను స్వీకరించి… గొప్ప పనులు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అభివృద్ధి కోసమే కాదు… మంచి ప్రయోజనాల కోసం కూడా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌ లో ఆటోమేషన్ కారణంగా భారీగా ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చని… కొత్త ఉద్యోగాల అన్వేషణ ఇప్పటి నుంచే ప్రారంభించాలని జుకర్‌ చెప్పారు.

డిగ్రీ పట్టా పొందిన సంతోషాన్ని జుకర్‌ బర్గ్‌ తన తల్లితండ్రులు, భార్యతో పంచుకున్నారు. డిగ్రీ పట్టాను అందుకుంటానని అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని జుకర్‌ చెప్పారు. డిగ్రీ పట్టాతో తన తల్లిదండ్రులతో దిగిన ఓ ఫోటోను ఆయన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు.