దేశంలో ఎక్కడా లేనివిధంగా గొర్రెల పంపిణీ

గొల్ల కురుమల అభ్యున్నతి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒక్క సంగారెడ్డి నియోజకవర్గానికే రూ.50 కోట్లు కేటాయించామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన గొల్ల కురుమలు ప్రతిఒక్కరికీ దాదాపు లక్ష రూపాయలు సబ్సిడీ కింద ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. సంగారెడ్డిలో జరిగిన గొర్లకాపర్ల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేసి చేతులు దులుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్నివిధాల అందుబాటులో ఉంటుందని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. గొర్రెల పంపిణీతో పాటు వాటికి అవసరమైన గడ్డి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల ఎకరాలలో స్టయిలో గ్రాస్ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తోటల్లో గడ్డి పెంచేలా ఉచితంగా గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. 1962 నెంబర్‌కు డయల్‌ చేస్తే గొర్రెల మంద దగ్గరికే పశువుల డాక్టర్‌ వస్తాడని, త్వరలోనే నియోజకవర్గానికి ఒక సంచార పశువైద్యశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏడాదికి నాలుగు సార్లు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తామని, వెటర్నరీ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.