తప్పకుండా నాకు బూస్టింగ్ వస్తది!

తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆనందో బ్రహ్మ. భయానికి నవ్వంటే భయం అని ఉపశీర్షిక. మహి వి. రాఘవ్ దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ “పింక్, నామ్ షబానా సినిమాల చిత్రీకరణతో బిజీగా వున్న సమయంలో దాదాపు ఏడాది క్రితమే ఈ చిత్ర కథ విన్నాను. హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త జోనర్‌లో తెరకెక్కిన చిత్రమిది. నాకు చిన్నా, పెద్ద అనే తేడా లేదు. నాకు కాన్సెప్ట్ నచ్చాలి అంతే. మంచి కథాబలమున్న సినిమా. నేను తెలుగు సినిమాలకు ఎప్పుడూ దూరం కాలేదు. ఏడేళ్లుగా మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాతో తెలుగులో నా కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందనే నమ్మకముంది” అని తెలిపింది. జూలై రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.