టిఆర్ఎస్ లో చేరిన రమేశ్ రాథోడ్, రవీందర్ రావు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్‌రావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాథోడ్, పైడిపల్లితో పాటు పలువురు టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరారు.

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఆకాంక్షతో రమేశ్ రాథోడ్, రవీందర్ రావు టిఆర్ఎస్ లో చేరారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని భావించి పార్టీలో చేరిన వారందరికి సాదర స్వాగతం పలుకుతున్నట్టు సీఎం కేసీఆర్‌ చెప్పారు. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టాలుంటాయని, ఇది అలాంటి సందర్భమే అన్నారు. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు టిఆర్ఎస్ లో చేరడంతో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. వీరిద్దరి స్థాయికి తగ్గట్టుగా పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

రమేశ్ రాథోడ్ వెంట తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేశ్ రాథోడ్, టీటీడీపీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ యూనిస్ అక్బానీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అబ్దుల్‌కలాం, ఉమ్మడి జిల్లా గిరిజనేతరుల సంఘం అధ్యక్షుడు నాందేవ్, ఉపాధ్యక్షుడు బుట్టోతో పాటు 30 మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, పది మంది పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు టీఆర్ఎస్ లో చేరారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్‌రావు వెంట ఖానాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్‌రావు, ఎస్టీ సెల్ నాయకుడు భరత్ చౌహన్‌తో పాటు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా ఇప్పటికే తమ తమ పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టున్న ఇద్దరు కీలక నేతలు ఒకే రోజు గులాబీగూటికి రావడంతో ఆయాప్రాంతాల్లో టీటీడీపీ, కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.