జైపాల్, బీజేపీ నేతలపై శ్రీనివాసగౌడ్ మండిపాటు

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, బీజేపీ నేతలపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేని వ్యక్తి.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఒక్కమాట మాట్లాడని జైపాల్.. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బీజేపీకి బీసీలపై కొత్తగా ప్రేమ పుట్టుకొస్తోందని శ్రీనివాస గౌడ్ ఎద్దేవా చేశారు. అంత ప్రేమ ఉంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఇస్తున్న గౌరవం దత్తాత్రేయకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కులవృత్తులను కాపాడేందుకే, బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. అన్ని కులాల్లోని పేదల కోసం పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు.