జూన్ 13 నుంచి బడిబాట

వచ్చే నెల 13 నుంచి 17 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టంగా తయారు చేసి, నాణ్యమైన విద్య అందేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి సచివాలయం నుంచి ఆయన వారితో సుమారు మూడు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

బడిబాటలో కలెక్టర్లు రోజుకొక గ్రామంలో పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కచ్చితంగా పెంచాలని అన్నారు. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులను బడిబాటలో భాగస్వాములను చేయాలని సూచించారు. బడిబాట పోస్టర్లు, కరపత్రాలు, ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. విద్యార్థుల నమోదును బట్టి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించే అధికారం కలెక్టర్లకే అప్పగిస్తున్నామని తెలిపారు.

పాఠశాలల పున: ప్రారంభం నాటికి అన్నిచోట్ల కనీస వసతులు ఉండాలని కడియం శ్రీహరి అన్నారు. కలెక్టర్ల ఫండ్ తో పాటు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద నిధులు రాబట్టి పాఠశాలల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని హైస్కూళ్లలో పవర్ సప్లై, కాంపౌండ్ వాల్స్ కచ్చితంగా ఉండాలన్నారు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు. 391 కేజీబీవీలకు ఫర్నిచర్, బెడ్ మెటీరియల్, ట్రంక్ బాక్స్, ఇతర వస్తువులు ఇస్తున్నామని, కలెక్టర్లు కేజీబీవీలను తనిఖీ చేయాలని చెప్పారు. 110 కొత్త మండలాల్లో మొదటి దశలో 84 కేజీబీవీలు వచ్చాయని తెలిపారు. వీధి బాలలు, అనాథలు, ఇంకా నమోదు కాని విద్యార్థుల కోసం 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యాయని వెల్లడించారు. వీరిని చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

11 వేల మంది విద్యావాలంటీర్లను నియమించుకునే ఆదేశాలిచ్చామని కడియం శ్రీహరి తెలిపారు. వీరి వేతనాలు 8000 నుంచి 12వేలకు పెంచామని, వీరందరూ జూన్ 12 నాటికి నియామకమయ్యేటట్లు చూడాలని చెప్పారు. హరితహారం కింద ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే ప్రణాళిక చేసుకోవాలని అన్నారు. మొక్కల సంరక్షణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం సాయం తీసుకోవాలని సూచించారు.

రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, బయోమెట్రిక్ మెషీన్లు, కంప్యూటర్ ల్యాబ్స్ కచ్చితంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫామ్ లను అనుకున్న సమయంలో ఇవ్వాలని చెప్పారు. పాఠశాలల సివిల్ వర్క్స్ ను కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. గతంలో మాదిరిగా బిల్లుల చెల్లింపులో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు, జాప్యం ఉండదని తెలిపారు.

పాఠశాలల పున: ప్రారంభంపై జూన్ 4వ తేదీ తర్వాత జిల్లా అధికారులతో కలెక్టర్లు సమీక్షా సమావేశం నిర్వహించాలని కడియం శ్రీహరి సూచించారు. పాఠశాలలన్నింటికి మరమ్మత్తులు చేయించి, సున్నం, కలర్లు వేయించి వాటికి కొత్త శోభను తీసుకురావాలన్నారు.

కిచెన్ గదుల నిర్మాణం, స్కూల్ బెంచీల తయారీ కొంత ఆలస్యమవుతోందని కలెక్టర్లు చెప్పారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పుస్తకాలు విద్యార్థులకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. హరితహారం కింద పాఠశాలల్లోమొక్కలు నాటేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, రన్నింగ్ వాటర్ ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాల్లో డీఈవోలు, ఇతర సిబ్బంది కొరత తీర్చాలని డిప్యూటీ సిఎం ను కలెక్టర్లు కోరారు.