గొర్రెలకు గడ్డి పెంపకానికి ఏర్పాట్లు

దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్ల, కురుమలు, యాదవుల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయబోతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతున్నది. ఈ తరుణంలో గొర్రెలకు గడ్డికి ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గడ్డి పెంపకంపై అటవీశాఖ అధికారులతో హైదరాబాద్ లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి పి.కె. జాతో పాటు ఇతర ఉన్నతాధికారులు మీటింగ్ లో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు స్టయిలో రకం గడ్డి పెంచేందుకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి జిల్లాల వారీగా స్టయిలో గడ్డి పెంచేందుకు అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించబోతున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. బంజరు భూములతో పాటు, పండ్ల తోటలు, పరిమిత సంఖ్యలో అటవీ స్థలాల్లో కూడా గడ్డి పెంచబోతున్నారు. సుమారు యాభై నుంచి అరవై లక్షల ఎకరాలు ఈ విధంగా గడ్డి పెంపకానికి అనువుగా ఉన్నట్లు ఒక అంచనా.

పశు సంవర్థక శాఖ ఈ యేడాది స్టయిలో హెమటా అనే గడ్డి రకాన్ని పూర్తి ఉచితంగా సరఫరా చేయనుంది. ఒక్కో ఎకరాకు రెండు కేజీల గడ్డి విత్తనం సరిపోతుంది. అంతేకాకుండా  స్టయిలో గ్రాస్ పెంపకం వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. అది భూమికి మంచి చేయటంతోపాటు, మనుషులకు, జంతువులకు ఉపయోగకరంగా ఉంటుంది. గడ్డి పెంపకం విషయంలో విమర్శలకు తావు లేకుండా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పశు సంవర్థక, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులు ఒక టీమ్ గా ఏర్పాటవుతారు. నిరంతరం గడ్డి పెంపకాన్ని పర్యవేక్షించనున్నారు. మొత్తానికి గొర్రెలకు సరిపడా మేతను సిద్ధం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.