గుడుంబా రహితంగా వరంగల్ జిల్లా

గుడుంబా స్థావరాలపై దాడులు చేయడం, కేసులు పెట్టడమే కాకుండా గుడుంబా వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గుడుంబా ప్రభావిత వ్యక్తుల పునరావాస పథకం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లాలో గుడుంబాను పూర్తిగా నివారించామని, రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట ప్రాంతాల్లో కొంత మేర గుడుంబాను నివారించాల్సి ఉందని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని సబర్వాల్ తెలిపారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేయడమే కాకుండా.. గుడుంబా ద్వారా జరిగే అనర్థాలను గ్రామ సభలు, పోస్టర్లు, మహిళా సంఘాల ద్వారా ప్రతీ గ్రామంలో ప్రచారం చేయాలని అధికారులకు అకున్ సబర్వాల్ సూచించారు.

గుడుంబా అమ్మకాలపై అధారపడి జీవిస్తున్న సుమారు 7 వేల కుటుంబాలకు బ్యాంకు లింకేజీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిందని,  ఇందుకు బడ్జెట్ లో 158 కోట్ల రూపాయలు కేటాయించిందని అకున్ సబర్వాల్ వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో రెండు వందలకు పైగా కుటుంబాలకు, వరంగల్ రూరల్ జిల్లాలో వందకు పైగా కుటుంబాలకు సహాయం అందిస్తామన్నారు. ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకొని గుడుంబా మహమ్మారిని తరిమికొట్టాలని అకున్ సబర్వాల్ కోరారు.

ఈ సమావేశంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పలువురు పోలీస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.