కోటి మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ!

నిరుపేదల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఐదు రూపాయల భోజనం పథకం చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ లో ఇప్పటివరకు ఏకంగా కోటిమందికి కడుపునిండా భోజన వసతి కల్పించి కల్పతరువుగా నిలిచింది. చేతిలో సరిపడా డబ్బులు లేక ఆకలితో అలమటించే పేదవాడికి ఈ పథకం నిజంగా అన్నపూర్ణే. అందుకే ఈ పథకంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఐదు రూపాయలు ఖర్చుపెడితే గట్టిగా సింగిల్ టీ కూడా రాని ఈ రోజుల్లో.. ఐదు రూపాయలకే నిరుపేదలకు కడుపు నిండా వేడివేడి భోజనమంటే మాటలు కాదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్ఎంసీకే అది సాధ్యమైంది. తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలన్న సదుద్దేశ్యంతో అన్నపూర్ణ పథకానికి శ్రీకారం చుట్టారు. హరేకృష్ణ మూవ్ మెంట్ వారి అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో ఇది ప్రారంభమైంది.

మొట్టమొదటి సారిగా 2014 మార్చి 2వ తేదీన నాంపల్లిలోని సరాయిలో ఈ భోజనామృతాన్ని అందించడం మొదలైంది. అక్కడ్నుంచి రోజురోజుకు దీనికి ఆదరణ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇప్పటివరకు సిటీలో కోటిమందికి పైగా అన్నపూర్ణ భోజన వసతి కల్పించడం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఐదు రూపాయల భోజన పథకం కోటి మంది పేదల అకలి తీర్చడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఐదు రూపాయల భోజనం పథకంలో ప్రత్యేకత ఏంటంటే.. నాణ్యత విషయంలో రాజీ ఉండదు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం దీని స్పెషాలిటీ. రోజూ  ఉద‌యం 11గంట‌ల నుండి మధ్యాహ్నం 2 గంట‌ల‌లోపు ఈ భోజనాన్ని అందిస్తారు. ఈ మీల్స్ లో 400 గ్రాముల రైస్, 100 గ్రాముల పప్పు, 100 గ్రాముల కర్రీ, సాంబార్ ఇస్తారు. ఒక్కో భోజ‌నానికి 24 రూపాయ‌ల 25 పైస‌లు వ్య‌యం అవుతోంది. ఇందులో 19 రూపాయ‌ల 25 పైస‌లను జీహెచ్ఎంసీ భరిస్తుండ‌గా..  కేవ‌లం 5 రూపాయ‌లు మాత్రమే ల‌బ్దిదారుడు చెల్లిస్తున్నాడు. అంటే చేతిలో ఐదు రూపాయలుంటే చాలు హైదరాబాద్ లో ఏ సెంటర్ కు వెళ్లినా కడుపునిండా భోజనం చేయొచ్చు.

5 రూపాయలకే భోజనం పథకం హైదరాబాద్ లాంటి మహానగరంలో నిరుపేదల పాలిట నిజంగానే అన్నపూర్ణ లాంటిది. ఎందుకంటే సిటీలో ఏ సెంటర్ లో చూసినా ఎక్కువగా లేబర్ అడ్డాలు, మార్కెట్లు, చౌరస్తాలు కనిపిస్తాయి. ఇక్కడ పొట్టకూటి కోసం తిరిగే వాళ్లే ఎక్కువగా ఉంటారు. అలాగే నిరుద్యోగుల గురించి చెప్పనక్కర లేదు. ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు జారీ చేస్తుండడంతో అన్నపూర్ణ సెంటర్లలో భోజనం తినే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ముఖ్యగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ లైబ్రరీతో పాటు పాటు భారీ సంఖ్యలో కోచింగ్ కేంద్రాలున్న అమీర్ పేట, అశోక్ నగర్ లాంటి చోట ఐదు రూపాయల భోజనం కోసం నిరుద్యోగులు క్యూ కడుతున్నారు.

ఇక ప్రభుత్వాసుపత్రుల పరిసరాల్లో అన్నపూర్ణకు విశేష స్పందన లభిస్తోంది. నిమ్స్‌, ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రి, గాంధీ ఆసుప‌త్రి, నీలోఫ‌ర్ ఆసుప‌త్రి, పేట్ల‌బుర్జు ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆసుప‌త్రి, కోఠి ఈఎన్‌టి ఆసుప‌త్రి, నాచారం, ఎర్ర‌గ‌డ్డ‌ల‌లోని ఈఎస్ఐ ఆసుప‌త్రులు, బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రుల పరిసరాల్లో ఈ మీల్స్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 3వేల మంది పేషంట్లు, వారి అటెండెంట్లు అన్నపూర్ణలో కడుపునిండా అన్నం తింటున్నారు.

మొత్తంగా సిటీలో ప్రస్తుతం 141 కేంద్రాల ద్వారా 35 వేలమందికి పైగా ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందడం విశేషం. ఇందులో కూలీలు, విద్యార్థులు, డ్రైవర్లు, పేషెంట్లతో పాటు పాటు సంపన్నులు కూడా ఉండడం విశేషం. సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రంలో సంపన్నులు కూడా  లైన్లో నిల్చొని మరీ ఐదు రూపాయల భోజనాన్ని పసందుగా ఆరగిస్తారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా అన్నపూర్ణలో భోజనం చేస్తారంటే.. దీనికి ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది.

అన్నపూర్ణ కేంద్రాల్లో ఇప్పటివరకు భోజనం తిన్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అందరూ ఈ రుచికరమైన భోజనం గురించి మెచ్చుకున్న వారే.  మినిస్టర్ కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేత జానారెడ్డి, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారుల హెచ్.ఎస్. బ్రహ్మ, ప్రముఖ సంఘ సేవకులు స్వామి అగ్నివేశ్.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా మంది ఈ మీల్స్ ను రుచి చూశారు. భోజనం నాణ్యతతో పాటు అన్నపూర్ణ నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించారు. ఇక ఏపీలోని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఐదు రూపాయల భోజనానికి ఫిదా అయిపోయి.. తన నియోజకవర్గంలోనూ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంతలా అందరి మెప్పు పొందింది ఈ ఫైవ్ రూపీస్ మీల్స్. ఇలాంటి రుచిరకమైన నాణ్యమైన భోజనం సిటీలోని ఏ చిన్నపాటి హోటల్ లో అయినా 40 రూపాయలు పెట్టినా దొరకదంటే అతిశయోక్తి కాదు.

డీమానిటైజేషన్ తో డబ్బుల కొరత ఏర్పడడంతో హైదరాబాద్ లో ఐదు రూపాయల పథకాన్ని నిరుపేదలకు మరింత చేరువ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సిటీలో సెంటర్ల సంఖ్యను 150కి పెంచాలని సూచించారు. అందులో భాగంగానే మొదట్లో 50గా ఉన్న సంఖ్య ఇప్పుడు 141కి పెరిగింది. త్వరలోనే మరికొన్ని చోట్ల ఈ అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తోంది.

ఐదు రూపాయల భోజనం పథకంలో ఇప్పటిదాకా కోటిమందికి పైగా కడుపునిండా అన్నం తిన్నారు. మూడేళ్ల కింద ఎలాంటి హడావుడి లేకుండా మొదలైన ఈ పథకం ఇప్పుడు ఇంతలా ఆదరణ పొందుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది నిజంగా గొప్ప విషయం. చేతిలో సరిపడా డబ్బులు లేక ఆకలితో అలమటించే పేదవాడికి ఈ పథకం నిజంగా అన్నపూర్ణే. అందుకే దీన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇదే నాణ్యత కొనసాగితే.. ఈ అన్నపూర్ణ భోజనం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడం ఖాయం.