కేసీఆర్ కిట్ ప్రారంభానికి సిద్ధం

కేసీఆర్ కిట్ల(అమ్మఒడి) పంపిణీకి తెలంగాణ వైద్య అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుక‌గా వచ్చే నెల 3న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్ పేట్ల బురుజు ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి ల‌క్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ప‌రిక‌రాలు, మందులను అందుబాటులోకి తేవ‌డ‌మేగాక‌, అన్ని ప్రసూతి కేంద్రాల్లో ప‌రీక్షలు నిర్వహించి, ప్రసవాలు జ‌ర‌ప‌డానికి అవ‌స‌ర‌మైన విధంగా వైద్య బృందాల‌ను పున‌ర్ వ్యవ‌స్థీక‌రించాల‌ని నిర్ణయించారు. అలాగే మేడ్చల్ జిల్లా కేంద్రంలో వెంట‌నే ఒక మాతా శిశు సంర‌క్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. కేసీఆర్ కిట్ల పంపిణీ, రాష్ట్రంలో వైద్య సేవ‌ల మీద సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సచివాలయంలో స‌మీక్షించారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ కిట్ల ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నుందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 9 టీచింగ్ హాస్పిట‌ల్స్‌, 6 జిల్లా వైద్యశాల‌లు, మూడు మాతా శిశు సంర‌క్షణ కేంద్రాలు, 30 ఏరియా హాస్పిట‌ల్స్‌, 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంట‌ల‌పాటు న‌డిచే 314 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, మ‌రో 365 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు మొత్తం 841 ద‌వాఖానాల్లో ప్రసవాలు జ‌రుగుతున్నాయని వెల్లడించారు. ఈ అన్ని హాస్పిట‌ల్స్‌ లోనూ కేసీఆర్ కిట్ల పంపిణీకి అన్ని స‌దుపాయాలు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ‌లో ఏటా 6,28,319 ప్రస‌వాలు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి వివ‌రించారు. ఇందులో క‌నీసం 50 శాతం ప్రస‌వాలు ప్రభుత్వ ద‌వాఖానాల్లోనే జ‌రిగే విధంగా చూడాల‌ని అధికారుల‌కు చెప్పారు. ప్రస్తుతం 30 శాతం నుంచి 40 శాతం వ‌ర‌కు ప్ర‌స‌వాలు ప్రభుత్వ వైద్యశాల‌ల్లో జ‌రుగుతున్నాయ‌ని మంత్రి వివ‌రించారు.

కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు లక్షల‌కుపైగా గ‌ర్భిణులు న‌మోద‌య్యారని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. గ‌ర్భిణుల న‌మోదు నిరంత‌రం జ‌ర‌గాల‌న్నారు. వారికి మూడు విడ‌త‌లుగా రూ‌.12 వేలు, ఆడ‌పిల్ల పుడితే అద‌నంగా మ‌రో వెయ్యితో క‌లిపి రూ.13 వేలు చెల్లిస్తున్న విష‌యం కూడా ప్రజ‌ల్లోకి తీసుకెళ్ళాల‌న్నారు. అలాగే ప్రసవం త‌ర్వాత రూ.2 వేల విలువైన 16 ర‌కాల పిల్లల‌, మ‌రికొన్ని ర‌కాల బాలింత‌ల వస్తువుల‌తో క‌లిపి కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

మ‌రోవైపు, రాష్ట్రంలోని జిల్లాల వారీగా, వైద్యశాల‌ల వారీగా, ప్రసూతి కేంద్రాల వారీగా మంత్రి లక్ష్మారెడ్డి స‌మీక్షించారు. వైద్యులు, సిబ్బంది కొర‌త ఉన్నమాట నిజ‌మేన‌ని, త్వర‌లోనే కొత్త నియామ‌కాలు పూర్తయ్యేలోగా అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందిని క్రమ‌బ‌ద్దీక‌రించాల‌న్నారు. గైన‌కాల‌జిస్ట్‌, అనస్థీషియన్, పిడియాట్రిషియ‌న్‌, న‌ర్సింగ్‌, పారా మెడిక‌ల్ సిబ్బందిని క‌లిపి ఒక్కో యూనిట్ గా పున‌ర్ వ్యవ‌స్థీక‌రించాల‌న్నారు. ప్రతి ప్రసూతి కేంద్రంలో ప్రసవాలు జ‌రిగే విధంగా చూడాల‌న్నారు. ఎక్కడ ఏ స‌మ‌స్యలు త‌లెత్తకుండా జాగ్రత్త ప‌డాల‌న్నారు. సాధ్యమైనంత వ‌ర‌కు సాధార‌ణ ప్రసవాలు జ‌రిగే విధంగా చూడాల‌ని, అనివార్య ఆప‌రేష‌న్లను నివారించాల‌న్నారు.

మేడ్చల్‌లో మాతాశిశు సంర‌క్షణ కేంద్రాన్ని నిర్మించ‌డానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి మ్యాపుల‌ని ఆ జిల్లా క‌లెక్టర్ ఎం.వి. రెడ్డి మంత్రి ల‌క్ష్మారెడ్డికి చూపించారు. అనువైన స్థల సేక‌ర‌ణ‌కు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. భ‌విష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని స్థలం కాస్త ఎక్కువే సేక‌రించాల‌ని మంత్రి క‌లెక్టర్‌కి సూచించారు. స్థల సేక‌ర‌ణ పూర్తి కాగానే భ‌వ‌న నిర్మాణం, ఇత‌ర ఏర్పాట్లు వేగంగా జ‌ర‌గాల‌ని మంత్రి అధికారుల‌ని ఆదేశించారు. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో అవసరమైన వైద్య భవనాలు, కొత్త భవనాల అవసరం, వైద్య సేవల మెరుగు కోసం అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి ల‌క్ష్మారెడ్డి.

ఈ సమీక్షలో మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్ రావు, ఎం.వి. రెడ్డి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, తెలంగాణ రాష్ట్ర ఔష‌ధ సేవ‌ల మౌలిక స‌దుపాయాల సంస్థ ఎండి వేణుగోపాల్ రావు, చీఫ్ ఇంజ‌నీర్‌ లక్ష్మణ్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ చంద్రశేఖర్, ఆరోగ్యశ్రీ ఉద్యోగులు, జ‌ర్నలిస్టుల హెల్త్ స్కీం సీఈఓ డాక్టర్ పద్మ, వైద్య సంచాల‌కులు లలిత కుమారి, కేసీఆర్ కిట్లు-అమ్మఒడి సీఈఓ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.