కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అండమాన్‌ దీవుల మీదుగా ప్రయాణించిన నైరుతీ రుతు పవనాలు.. కేరళ తీరాన్ని పలకరించాయి. దాంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రుతు పవనాల ప్రభావంతో అలప్పుజా, కొట్టాయం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకూ 6 సెంటి మీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు త్రిసూర్‌, కోజికోడ్‌ జిల్లాల్లోనూ జోరు వాన కురిసింది.

సాధారణంగా జూన్‌1న నైరుతి రుతుపవనాలు కేరళలను తాకుతాయి. అందుకు భిన్నంగా ఈ సారి రెండురోజుల ముందే రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ రెండో వారం నాటికి పూర్తిగా విస్తరించనున్నట్లు అధికారులు చెప్పారు.

మరోవైపు ఈశాన్య రాష్ట్రాలను కూడా నైరుతీ తాకింది. మోరా తుఫాన్ వ‌ల్ల ఈశాన్య రాష్ట్రాల‌కు రుతుప‌వ‌నాలు చేరినట్లు ఐఎండీ డైరెక్టర్‌  జనరల్‌ ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదిలాయని చెప్పారు.