కాబూల్‌లో భారీ పేలుడు, 80 మంది మృతి    

ఆఫ్ఘనిస్థాన్‌ లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కాబూల్ లోని విదేశీ రాయబారుల కార్యాలయాలే లక్ష్యంగా కారు బాంబుతో దాడి చేసి 80 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ పేలుడులో మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. మృత దేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో ఇండియన్‌ ఎంబసీ కూడా స్పల్పంగా ధ్వంసమయ్యింది. కార్యాలయ అద్దాలు పగిలిపోయాయి. దాంతో ఎంబసీని తాత్కాలికంగా మూసేశారు. ఐతే, ఇండియన్ ఎంబసీ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఘటనతో ఆఫ్గనిస్థాన్‌ అంతటా హై అలర్ట్‌  ప్రకటించారు.

కాబూల్‌ లో ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. బాంబు పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో ఆఫ్గనిస్థాన్‌ కు అన్ని విధాల అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ఓడించాలని మోడీ పిలుపునిచ్చారు.