కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలి?

కాంగ్రెస్ నాయకులు కాదు కదా.. వాళ్ల తాత జేజమ్మలు వచ్చినా ప్రాజెక్టులను ఆపలేరని, మహా అయితే నెల రెండు నెలలు ఆలస్యం అవుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుని ఆపడానికి ఆ పార్టీ నాయకులు 15 రోజుల్లోనే నాలుగుసార్లు కోర్టుకు వెళ్లిన్రని మండిపడ్డారు. ప్రాజెక్టుల భూసేకరణను అడ్డుకోవద్దని సుప్రీంకోర్ట్ తీర్పు ఉందని జడ్జీలు బుద్ధి చెబుతున్నా మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని విమర్శించారు. జడ్జీలు కూడా ధర్మం వైపు ఉంటారని అన్నారు. ప్రాజెక్టులను ఆపేందుకు ఇన్ని దుర్మార్గాలు చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రమేశ్ రాథోడ్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్ రావు సహా వందల మంది టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, వేలమంది కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

గత కాంగ్రెస్ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక్క ఇసుక మైనింగ్ ఉదాహరణ చాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ప్రజాధనాన్ని ఇసుక మీదనే ఆ పార్టీ నాయకులు వందల కోట్లు తిన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఇసుక మీద ఆదాయం కేవలం రూ. 20 లక్షలు ఉందని, తాము నోరు, కడుపు కట్టుకొని నిజాయితీగా పనిచేస్తే 2015-16 సంవత్సరంలో రూ. 360 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 450 కోట్లు వచ్చిందన్నారు. ఈ సంవత్సరం అది రూ.600 కోట్లు దాటుతుందని వివరించారు. ఇదంతా పేదలకు పింఛన్లు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నామని చెప్పారు.

టిఆర్ఎస్ కు ఓటు వేయడానికి ప్రజలకు అనేక కారణాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక్క కరెంట్ విషయంలో ప్రజల సంతృప్తి చాలన్నారు. కరెంట్ విషయంలో రైతులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ముప్పయ్యేళ్లు ఏడిపించాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రింబవళ్లు పొలం దగ్గర కాపలా కాసిన రైతులు, కాలిపోయిన వేలాది మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు, పాములు కరిచి చనిపోయిన రైతులు.. చెప్పుకుంటూ పోతే తీరదన్నారు. పారిశ్రామికవేత్తలు పవర్ హాలిడేలు ప్రకటించి, ధర్నాలు చేసిన విషయం గుర్తుచేశారు. తాము అధికారం చేపట్టి ఆరు నెలలు తిరక్కుండానే 24 గంటలు కోతల్లేని నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని, వ్యవసాయానికి 9 గంటలు పగలే విద్యుత్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు.

కాంగ్రెస్, టీడీపీ పాలనలో మనుషులుగా చూడకుండా చాకిరి చేయించిన వారిని జీతాలు పెంచి, రెగ్యులరైజ్ చేస్తున్నామని అన్నారు. 24 వేల మంది హోంగార్డులను త్వరలోనే రెగ్యులరైజ్ చేయబోతున్నామని, పాతిక వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తున్నామని, అంగన్ వాడీలు, గ్రామ సహాయకులు, ఆశ వర్కర్లు.. ఇలా అందరి జీతాలు పెంచామని చెప్పారు. వీళ్లంతా ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించారు.

ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గత పాలకులు ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. బీడీ కార్మికులు, వృద్ధులు, వింతతువులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 15 వందలు పింఛన్లు ఇస్తున్నామని, బాలింతలకు కేసీఆర్ కిట్ ఇవ్వబోతున్నామని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడపిల్లల పెండ్లికి సాయం చేస్తున్నామని, గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయబోతున్నామని, మత్స్యకారులకు చేపపిల్లలు పంపిణీ చేశామని, చేనేత కార్మికులకు సబ్సిడీపై ముడిసరుకు ఇచ్చి, వారి దగ్గర మిగిలిన బట్టను ప్రభుత్వమే కొంటుందని.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.

సమైక్య పాలనలో ఆగమైన రైతులను నిలబెట్టేందుకు పెట్టుబడి కింద సాలుకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున చెల్లించనున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు పంటలు పండిస్తే చిన్న పెద్ద రైతుల తేడా లేకుండా ఎకరానికి రూ.8 వేలు ఇస్తామన్నారు.  రైతులకు నీళ్లిచ్చే దగ్గర్నుంచి పంటకు ధర వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో భూములన్నిటిని పంటల కాలనీలుగా విభజిస్తామని, గిట్టుబాటు ధర వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ వివరించారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు క్యూలో పెట్టేవారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పుడు కూడా ఖరీఫ్ కు ముందే 12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెచ్చి సిద్ధంగా ఉంచామని, చినుకు పడితే రైతులకు ఇస్తామని ప్రకటించారు.

జాతీయ నాయకుల అంచనాలకు కూడా అందని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలో తాను చెప్పిన విషయాలు ఇప్పుడు రుజువు అవుతున్నాయని వివరించారు. ఆంధ్రా రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని శఠగోపం పెట్టిన చంద్రబాబు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆయనకు అక్కడ కాలం చెల్లిందని, ఆంధ్రాలో ఆయన సక్కగ చేసుకుంటే చాలని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

బంగారం లాంటి భూములున్న ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతాలు జరగబోతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి 70-80 వేల ఎకరాలకు అదనంగా నీళ్లిచ్చినమని తెలిపారు. మిగిలిన ప్రాజెక్టులు కూడా పూర్తయితే బ్రహ్మాండమైన పంటలు పండించుకోవచ్చని చెప్పారు.