ఏ నిర్ణయం తీసుకోలేదు!

ద్వైపాక్షిక సిరీస్ విషయంలో అటు బీసీసీఐ, ఇటు పీసీబీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయాయి.  పాక్‌తో మ్యాచ్‌లకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఈ విషయంలో బీసీసీఐ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. దుబాయ్‌లో జరిగిన బీసీసీఐ, పీసీబీ సమావేశంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదురి, సీఈవో రాహుల్ జోహ్రీ, జీఎమ్ (క్రికెట్ ఆపరేషన్స్) ఎంవీ శ్రీధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుందుకు నష్టపరిహారం కింద రూ. 387 కోట్లు చెల్లించాలన్న పాక్ డిమాండ్‌ను బీసీసీఐ అధికారులు తోసిపుచ్చినట్లు సమాచారం. “బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య సామరస్యపూర్వకంగా సమావేశం జరిగింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాస్తవ పరిస్థితులపై మాట్లాడారు. పరిహారం అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ అంశాలను రెండు దేశాల బోర్డులకు తెలియజేసిన తర్వాత బయటకు వెల్లడిస్తాం” అని భారత క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. చాంపియన్స్ లీగ్ టీ20 స్థానంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాలనే ప్రతిపాదన కూడా రెండు బోర్డుల మధ్య చర్చకొచ్చినట్లు సమాచారం. తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చేంత వరకు కనీసం తటస్థ వేదికపై కూడా ఆడే అవకాశం లేదని బీసీసీఐ పీసీబీకి స్పష్టం చేసింది.