ఎర్రన్నలకు చేదు అనుభవం!

హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ విషయంలో జనం గోడు పట్టని విపక్షాలు మళ్లీ మళ్లీ అదే రాజకీయం చేస్తున్నాయి. ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ తో నరక యాతన పడుతున్నామని స్థానికులు పదేపదే మొత్తుకుంటున్నా.. విపక్షాల చెవికి ఎక్కడం లేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు, జేఏసీ నేతలు ప్రజాభిప్రాయణ సేకరణ పేరుతో బస్తీల చుట్టూ తిరిగారు. ఏ బస్తీలో తిరిగినా, ఏ గల్లీకి వెళ్లినా వారికి చేదు అనుభవమే ఎదురైంది. ధర్నా చౌక్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అని ఒక గల్లీలో గృహిణిని అడిగారు. మాటిమాటికీ ధర్నాలు చేస్తుంటే.. పిల్లలు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది అవుతోందని ఆమె సూటిగా సమాధానం చెప్పింది. దాంతో చాడా బృందం ఖంగుతిన్నది.

వీళ్ల ప్రజాభిప్రాయ సేకరణ ఎలా ఉందంటే.. ఓ ఇంటి ముందు కూర్చొని సేదతీరుతున్న వృద్ధురాలిని ధర్నా చౌక్ గురించి ప్రశ్నించారు. వాళ్ల మతిలేని ప్రశ్నకు ఆ పెద్దావిడ మంచి సమాధానమే ఇచ్చింది. తనకేం కష్టాల్లేవని, ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌ తో హాయిగా బతుకుతున్నానని తడుముకోకుండా చెప్పింది. అంతే.. చాడా టీం ముఖంలో రక్తపు చుక్కలేదు!

మరో బస్తీలో బండి మీద పోతున్న ఇద్దరు స్థానికులను ఆపి, ధర్నా చౌక్ గురించి ప్రశ్నించడానికి ప్రయత్నించారు. వాళ్లిద్దరు కొంచెం సీరియస్‌గా కనిపించడంతో.. ఏం లేదు ఏం లేదంటూ చాడా బృందం ముందుకెళ్లడానికి ప్రయత్నించింది. మీరెంత అరిచి గీపెట్టినా.. మాకు మాత్రం ధర్నా చౌక్ వద్దని బండి మీదున్న ఇద్దరు వ్యక్తులు ముఖం మీదే చెప్పేశారు. ఇక్కడా వర్కవుట్ కాలేదని చాడా బృందం, జేఏసీ నాయకులు మరో బస్తీని వెతుక్కుంటూ వెళ్లారు.

ఇలా వెళ్లిన ప్రతిచోటా చాడా బృందానికి చుక్కెదురైంది. బస్తీల్లో ఎవరిని కదిపినా.. ఒకటే మాట చెప్పారు- మాకు ధర్నా చౌక్ వద్దని! బీమా మైదానం, గుడాల బస్తీ, బండమైసమ్మ బస్తీల్లో జనం కూడా ధర్నా చౌక్ ను తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు. దాంతో చాడా బృందం ప్రజాభిప్రాయ సేకరణ అట్టర్ ఫ్లాప్ అయింది.