ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి

నీటి పారుదల కాల్వల నిర్మాణం–మరమ్మతులు, మిషన్ భగీరథ పనుల్లో ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి సీఎం కేసీఆర్ సూచించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలించాలని చెప్పారు. ఎక్కడ జాప్యం జరిగినా, ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పనులు వేగంగా జరిగేట్లు చూడాలన్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో పలువురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజి, పంపుహౌజ్ ల నిర్మాణం పూర్తయ్యే లోపుగానే నీటి పారుదల కాల్వల నిర్మాణం పూర్తి చేసుకోవాలని, ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఎస్ఆర్ఎస్పి, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకంలో లేక ఫీడర్ ఛానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని సిఎం అన్నారు. వాటిని వెంటనే మరమ్మతు చేయాలన్నారు. ఎక్కడ ఏ పనులు అవసరమో గుర్తించి, అధికారులతో చేయించాలని ఎమ్మెల్యేలను కోరారు. రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక ప్రాజెక్టులు కడుతున్నామని, ప్రాజెక్టుల ద్వారా నీరందించాల్సింది కాల్వలే కాబట్టి అవి ముందుగా సిద్ధం చేయాలని చెప్పారు. బ్యారేజిల నిర్మాణం జరగడానికన్నా ముందే పంపుహౌజుల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలున్నాయని, కాబట్టి కాల్వలు సిద్ధంగా ఉంటే చెరువులు నింపుకోవచ్చని సిఎం వివరించారు.

తమ నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ పనులపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. తమ నియోజకవర్గానికి నీళ్లందించే ఇన్ టేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, పంపుహౌజులు, సబ్ స్టేషన్లు, పైపు లైన్ల నిర్మాణం ఎక్కడి దాకా వచ్చింది? నిర్ణీత సమయంలో పనులు అవుతున్నాయా? లేదా? అనే విషయాలను గమనించాలని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటే పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని, గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సిఎం చెప్పారు.

విలీన గ్రామాలకూ గొర్రెల యూనిట్లు
గ్రేటర్ వరంగల్ లో విలీనమైన 42 గ్రామాల్లో కూడా గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికే అవకాశం కల్పించడంతో వరంగల్ నగరంలో ఇటీవల చేరిన గ్రామాలకు అవకాశం పోయిందని మేయర్ నన్నపునేని నరేందర్ ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ గ్రామాల్లో యాదవులు, కుర్మలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారంతా గొర్రెల పెంపకం దారులుగా ఎన్నో ఏండ్ల నుంచి జీవనం గడుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకంలో వారినీ భాగస్వాములను చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి విలీన గ్రామాల్లోని యాదవులు, కుర్మలను కూడా సొసైటీల్లో చేర్పించి, పథకం వర్తింప చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని ఆదేశించారు.

ఎస్టీ బాలికలకు రెసిడెన్షియల్ స్కూళ్లు
ఎస్టీ బాలికల కోసం ఏర్పాటు చేయబోయే రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ ఏడాది జూన్ లోనే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్లు నడపాలని సూచించారు. వెంటనే తుది జాబితా రూపొందించాలని మంత్రి చందూలాల్ ను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనమండలి ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, పువ్వాడ అజయ్, సుధీర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, రేఖానాయక్, బాబురావు రాథోడ్, సాయన్న, ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.