ఎడ్‌సెట్‌-2017కు తొలిగిన అడ్డంకులు   

రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్-2017కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు  ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఎడ్‌ సెట్‌ నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించింది.  ఎన్‌సీటీఈ   నిబంధనల ప్రకారం ఎడ్‌సెట్ నిర్వహణకు నూతన మార్గదర్శకాలు రూపొందించారు. మార్గదర్శకాల్లో భాగంగా రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుకు సంబంధించి నిర్వహించనున్న ఎడ్‌సెట్‌కు బీఏ, బీకాం, బీఎస్సీ, హోంసైన్స్, బీసీఏ, బీబీఎం లేదా మాస్టర్ డిగ్రీల్లో సగటున 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కనీస విద్యార్హతల్లో 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుందని తెలిపారు. గ్రాడ్యుయేషన్ లేకుండా నేరుగా మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఎడ్‌సెట్‌కు అనర్హులుగా ప్రకటించారు. ఈ పరీక్షకు పోటీపడేందుకు కనీస వయోపరిమితిని జూలై ఒకటో తేదీ నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలని, గరిష్ఠ వయో పరిమితి ఏమీలేదని పేర్కొన్నారు.

ఎడ్‌సెట్-2017కు దరఖాస్తులను ఆన్‌లైన్ విధానం ద్వారా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెరిట్ పద్ధతిలో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మెరిట్‌  లిస్టును కమ్యూనిటీ వారీగా వెల్లడించాలని, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను భర్తీ చేయాలని సూచించింది. ఎన్‌సీసీ, క్రీడలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, ప్రాంతాల ప్రాతిపదికన భర్తీ ప్రక్రియ ఉండాలని చెప్పింది.