ఉప్పల్ ప్రాంతాన్ని నంబర్ వన్ గా మారుస్తాం

రాబోయే మూడేళ్లలో ఉప్పల్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ లోనే మొదటి స్థానంలో నిలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్.  ఉప్పల్ సర్కిల్ లో ప్రభుత్వం అభివృద్ధి చేయబోతున్న ప్రాంతాలను, కొత్తగా నిర్మించనున్న ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ ప్రాంతాన్ని, సుందరీకరణ చేయబోతున్న నల్ల చెరువు ప్రాంతాలను మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్లతో కలిసి సందర్శించారు. తర్వాత అధికారులతో వారు సమీక్ష జరిపారు.

జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడుల పెట్టేందుకు ఉప్పల్ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయని రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై నగరానికి స్వాగతం పలికే ఉప్పల్ లో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ. 970 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. ఉప్పల్ నుండి అలీ కేఫ్ వరకు మూసీ పరివాహక ప్రాంతం నుండి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.  వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న నల్లచెరువును సుందరీకరించి.. చుట్టూ పార్కులు, వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీలో వ్యర్థ పదార్థాల నుండి ఎరువులు తయారు చేస్తున్న వర్మీ కంపోస్టు కేంద్రాన్ని మేయర్ సందర్శించారు.