ఇవాళ్టి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ 

సుదీర్ఘర్యాలీలు, కళ్లు చెదిరే సర్వీస్ రిటర్న్స్..జర్రున జారుతూ ఆటగాళ్లు చేసే విన్యాసాలతో మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ సమరం నేటి నుంచి ఆరంభం కానుంది. నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యంత కఠినమైనది ఫ్రెంచ్ ఓపెన్. మట్టికోర్టుపై ప్రతి పాయింట్‌కు చెమటోడ్చాల్సిందే. గంటలపాటు సాగే ఈ టోర్నీ గెలువాలంటే అద్భుత ఫిట్‌నెస్‌తోపాటు ఆటలో వైవిధ్యం కూడా అవసరం. బంతిని టాప్‌స్పిన్ చేయడంలో.. సుదీర్ఘ ర్యాలీలు ఆడడానికి అవసరమైన ఫిట్‌నెస్ ఉన్న ఆటగాడే ఫ్రెంచ్ ఓపెన్ సాధించగలడు. గతేడాది పురుషుల చాంపియన్ సెర్బియా ఆటగాడు జొకోవిచ్, మహిళల సింగిల్స్ విజేత, స్విట్జర్లాండ్‌కు చెందిన ముగురుజా మళ్లీ కోటి ఆశలతో ఫ్రెంచ్ బరిలోకి దిగుతున్నారు. కాగా.. ఈ ఏడాది మళ్లీ మునుపటి ఫాంతో కనిపిస్తున్న స్పెయిన్ ఆటగాడు,మట్టికోట మహారాజు రఫెల్ నాదల్ హాట్ ఫేవరెట్‌గా ఫ్రెంచ్ ఓపెన్ బరిలో కాలుమోపుతున్నాడు. రోలాండ్ గారోస్‌లో ఇప్పటికే 9 సింగిల్స్ టైటిల్స్ సాధించిన నాదల్ పదో టైటిల్‌పై గురిపెట్టాడు. గతంలో నాదల్ కేవలం రెండుసార్లు మాత్రమే రోలాండ్ గారోస్‌లో పరాజయం పాలయ్యాడు. 2009లో రాబన్ సోదర్లింగ్, 2015లో జొకోవిచ్ చేతిలో మాత్రమే ఓడిన నాదల్‌కు క్లేకోర్టులో ఘనమైన రికార్డు ఉంది. ఈ ఏడాది ఇప్పటికే మాంటెకార్లో, బార్సిలోనా టైటిల్స్‌ను పదోసారి సాధించాడు. మాడ్రిడ్ ఓపెన్‌కూడా ఐదోసారి గెలుచుకుని క్లేకోర్టుపై తిరుగులేని ఫాంతో రోలాండ్ గారోస్‌లో అడుగుపెడుతున్నాడు. అతనికి గట్టిపోటీ నిచ్చేది ఆస్ట్రియా యువసంచలనం డొమినిక్ మాత్రమే. క్లేకోర్టుపై నాదల్‌నే కంగుతినిపించగల సామర్థ్యం ఈ యువ ఆటగాడి సొంతం. ఇక ముర్రే , జొకోవిచ్ మరోసారి గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతుండడంతో పురుషుల సింగిల్స్‌లో హోరాహోరీ సమరం తప్పేలా కనిపించడం లేదు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా, మహిళల నంబర్‌వన్ కెర్బర్ ఫేవరెట్లుగా గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగుతున్నారు. తొలిరౌండ్లో కెర్బర్ ..రష్యా సంచలనం మకరోవా రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. చెక్ రిపబ్లిక్ భామ పెట్రా క్విటోవా ఆరునెలల అనంతరం మళ్లీ గ్రాండ్‌స్లాం బరిలోకి దిగుతున్నది. సొంత ఇంట్లో దొంగ చేతిలో కత్తిపోటుకు గురైన క్విటోవా దాదాపు కెరీర్‌కు దూరమయ్యేంతగా గాయపడినా కోలుకుని మళ్లీ రాకెట్ చేతబట్టింది. క్విటోవా తొలిరౌండ్‌లో అమెరికాకు చెందిన జూలియాతో తలపడనుంది.