సుర్రుమంటున్న సూర్యుడు

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం పూటే ఎండలు రాఠెత్తిస్తుండగా..ఇక మధ్యాహ్నం చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇటు వాహనదారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏప్రిల్‌లోనే ఎండ తీవ్రత ఇంతగా ఉంటే రాబోయే మే నెలలోనే మరింత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందంటున్నారు.

సాధారణంగా ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ ఫస్ట్‌ వీక్‌ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మే  లాస్ట్ వీక్‌ వరకు ఎండలు తీవ్ర స్థాయిలో ఉంటాయి.  కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఎండలు మండుతున్నాయి. అన్ని రోజులూ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఇక  మే మొదటి వారం నుంచి తీవ్ర వడగాల్పులు వీసే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా పెరుగుదల లేదు. అయినా గాలిలో తేమశాతం తగ్గుతుండటంతో రాత్రి సమయాల్లోనూ వేడిగా ఉంటుంది. ఈ ప్రభావంతో  తర్వాతి రోజు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వరుసగా రెండు మూడు రోజులు ఇదే పరిస్థితులుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. దీనికి తోడు చెట్లను నరికేయడం, భవనాలు, కాలుష్యం పెరగడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు జనానికి ఉష్ణోగ్రతలు తట్టుకునే శక్తి కూడా క్రమంగా తగ్గుతుండటంతో తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది.

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ..వారికి అవగాహన కల్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. వడదెబ్బకు గురైన వారిని చల్లని ప్రదేశాలకు చేర్చాలని..ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్‌, ఓఆర్‌ఆర్‌ కలిపిన నీటిని తాగించాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులకు ఉదయం, సాయంత్రం మాత్రమే వెళ్లాలని చెప్పారు. రైతులు కూడా ఎండ తీవ్రత లేని సమయాల్లోనే వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. 104 సర్వీసుకు ఫోన్‌ చేస్తే అవసరమైన వైద్యసదుపాయం అందుతుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.