వినూత్నమైన ఆలోచనలు సీఎం కేసీఆర్ కే సాధ్యం

తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన కొత్త ఒరవడితో ముందుకెళ్తున్నదని ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. వినూత్న పథకాలు, ప్రగతి కాముక విధానాలు తీర్మానాన్ని టిఆర్ఎస్ 16వ ప్లీనరీలో ఆయన ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గొప్ప ఆదరణ లభించిందంటే సీఎం కేసీఆర్ ఆలోచన విధానమే కారణమని వినోద్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో పాటు  జిల్లాల విభజన కూడా జరగాలనేది కేసీఆర్ ఆకాంక్షగా ఉండేదని గుర్తు చేశారు. అందుకే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 31 జిల్లాలుగా విభజించారని చెప్పారు. ప్రజలకు పరిపాలన అందుబాటులో, సౌలభ్యంగా ఉండేందుకే జిల్లాల విభజన జరిగిందన్నారు. జిల్లాల విభజన వల్ల కేంద్రీయ విద్యాలయాలు, కేంద్ర సంస్థల సంఖ్య పెరుగుతుందన్నారు.

ఉద్యమ సమయంలోనే తెలంగాణ అవసరాలను కేసీఆర్ తెలుసుకున్నారని, వాటికి  అనుగుణంగానే ముందుకెళ్తున్నారని వినోద్ వివరించారు. చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ పథకం చేపట్టడం వినూత్నమైన ఆలోచన అని చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని దేశమంతా ప్రశంసిస్తోందన్నారు. మిషన్ భగీరథ పథకంపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోందన్నారు. కొత్త ఆలోచనలు సీఎం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకులాలు ఏర్పాటు చేయడం కూడా వినూత్నమైన ఆలోచన అని పేర్కొన్నారు.

గత పాలకులకు రాని ఆలోచనలు తమ సీఎం కేసీఆర్‌కు వస్తున్నాయన్నారు వినోద్. పచ్చదనం ఉంటేనే వర్షాలు పడుతాయని హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతి రహదారిని మెరుగుపర్చుకుంటున్నామని అన్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ మంజూరు చేశామన్నారు. డబుల్ రోడ్స్ వేయాలని సీఎం నిర్ణయించడం వినూత్నమైన ఆలోచనే అని స్పష్టం చేశారు. అన్ని కమిషనరేట్లను అనుసంధానం చేస్తూ.. హైదరాబాద్‌లో పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించడంతోనే క్రైం రేటు తగ్గిందన్నారు.

ఎంపీ వినోద్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని మరో ఎంపీ బాల్క సుమన్ బలపరిచారు.