విద్యుత్ రంగంలో తెలంగాణ విజయం

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు నెలలు తిరక్కుండానే విద్యుత్ రంగంలో విజయం సాధించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో విజయం, పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ అభివృద్ధిపై టిఆర్ఎస్ 16వ ప్లీనరీలో పల్లా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విద్యుత్ రంగంలో విజయం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు పల్లా. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ త్రిముఖ వ్యూహంతో కరెంట్ సమస్యను అధిగమించామని తెలిపారు.

గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ విధంగా విద్యుత్‌ను అందించగలమో కేసీఆర్ స్టడీ చేసి.. వాటికి అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా చేశారని పేర్కొన్నారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు కరెంట్ ఇవ్వడంతో మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారని తెలిపారు. నాడు పవర్ హాలిడే అయితే.. నేడు ఎవ్రీ డే పవర్ డే అని వివరించారు. పరిశ్రమల్లో 45 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 3 వేల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు. చిన్న పరిశ్రమల్లో ఉత్పత్తులు మూడు రెట్లు పెరిగాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల్లో సీఎం విశ్వసనీయత పెంచారని గుర్తు చేశారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు సమర్థించారు.