లారీ ఢీకొట్టి 20 మంది మృతి, పలువురికి గాయాలు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడులోని పూతల పట్టు- నాయుడు పేట రోడ్డులో పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. పలువురు గాయపడ్డారు. బాధితులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో లారీ ఢీకొని చనిపోయినవారు ఆరుగురు ఉంటే.. లారీ ఢీకొట్టడం వల్ల విద్యుత్ స్తంభం విరిగిపడి కరెంట్ వైర్లు తగి షాక్ తో మరో 14 మంది చనిపోయారు. ఏర్పేడులో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారంపై ఫిర్యాదు చేసేందుకు పీఎన్ రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ కు పెద్దసంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఈ సమయంలోనే లారీ దూసుకురావ‌డంతో అక్క‌డి జ‌న‌మంతా ప‌రుగులు పెట్టారు. లారీ సృష్టించిన బీభ‌త్సం, కరెంట్ షాక్ తో ఆ ప్రదేశం అంతా భయానకంగా మారింది.

చిత్తూరు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనలో ఎస్.ఐ, సీ.ఐ కూడా గాయపడ్డారని చెప్పారు. లారీ డ్రైవరుని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది ప్రమాదమా లేకుంటే అక్రమ ఇసుక వ్యాపారుల కుట్రా అనే విషయం తేల్చాల్సి ఉంది.