రాష్ట్రంలో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు

రాష్ర్టంలో పెట్టుబడులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యింది. పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు కీలకమైన అంశాలపైన చర్చించారు.

టియస్ ఐపాస్ అమలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం వంటి అంశాలపైన పలు నిర్ణయాలను ఉపసంఘం తీసుకున్నది. రూ.200 కోట్ల పెట్టుబడి లేదా 1000 ఉద్యోగాలు కల్పించే మెగా ప్రాజెక్టుగా ఇప్పటిదాకా ఉన్న నిర్వచనంలో భూమి విలువను సైతం కలిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అయితే, మెగా ప్రాజెక్టులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, కంపెనీల ఉత్పత్తి ఆధారంగా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.

జీఎస్టీ అమలు నేపథ్యంలో టి ఐడియా(T-IDEA) ద్వారా ఇచ్చే పన్ను రాయితీలను  పునర్ నిర్వచించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించే వారికి భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సంస్ధలకు చట్టప్రకారం ఫీజులను చెల్లించి, అనుమతులు పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీరాజ్ కమిషనర్ శాఖ పరమైన ఆదేశాలివ్వాలని కోరింది.

నాలా కన్వర్షన్ విధానంలోనూ మరింత ఈజ్ డూయింగ్ బిజినెస్ పెంచేందుకు మరొక నిర్ణయాన్ని మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్నది. ఈ మేరకు కన్వర్షన్ ఫీజులను టిఎస్ ఐపాస్ దరఖాస్తు సమయంలోనే ఫీజు చెల్లించిన తర్వాత 7 పని దినాలు దాటిన తర్వాత డీమ్డ్ అప్రూవల్ పద్దతిన అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సోలార్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ర్టంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ రంగంలోని పెట్టుబడిదారుల ఇబ్బందులపైన చర్చించారు. సోలార్ పెట్టుబడులను, రినెవబుల్ ఎనర్జీ పెట్టుబడులను సైతం టి ఐడియా పథకం కిందకు తీసుకుని వచ్చి, టి ఐడియా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమిషనర్ నదీమ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.