మాల్యా అరెస్ట్, విడుదల

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బెయిల్ మంజూరైంది. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరెస్టయిన మూడు గంటల్లోనే మాల్యా బెయిల్ పై విడుదలయ్యారు. విడుదలైన వెంటనే మాల్యా ఇండియన్ మీడియాపై సెటైర్లు వేశారు. వారిది అత్యుత్సాహమని, హడావుడి తప్ప ఏమీ లేదని ట్వీట్ చేశారు.

భారతీయ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో ఆయన్ను స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ విజ్ఞప్తి మేరకు మాల్యాను అరెస్ట్ చేసినట్లు స్కాట్ లాండ్ యార్ట్ పోలీసులు చెప్పారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా.. గత ఏడాది మార్చి 2న దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి లండన్ లో తలదాచుకుంటున్నారు.

విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల నుంచి మొత్తం 9వేల కోట్లు అప్పు తీసుకున్నారు. ఇందులో ఎక్కువగా ఎస్‌బీఐ నుంచి 1600 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 800, ఐడీబీఐ 800, బ్యాంక్ ఆఫ్ ఇండియా 650, బ్యాంక్ ఆఫ్ బరోడా 550, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 630, యూకో బ్యాంక్ 320, కార్పొరేషన్ బ్యాంక్ 310, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 150, ఐవోబీ 140, ఫెడరల్ బ్యాంక్ 90, పంజాబ్ సిండికేట్ 60, యాక్సిస్ 50 కోట్లు అప్పులు ఇచ్చాయి. దీంతో ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం విజయ్ మాల్యాపై న్యాయ పోరాటం చేస్తోంది. ఇటీవలే గోవాలోని మాల్యాకు చెందిన ఓ లగ్జరీ విల్లాను వేలం వేసింది ఎస్‌బీఐ.