ప్లీనరీకి గులాబీ శ్రేణులు రెడీ

తెలంగాణ ప్రజల ఆంకాంక్షలకు నిలువెత్తు రూపంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి పరదహారేండ్ల పండుగకు సర్వం సిద్ధమైంది..! పిడికెడు మందితో పుట్టిన పార్టీ పుట్టెడు జనం మద్దతుతో మరిసిపోయేలా ముందుకుపోతున్నది..! బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఉరకలేస్తున్నది..! అశేష జనాభిమానానికి తోడు క్రియాశీల శ్రేణుల కార్యచరణతో అనుకున్న ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నది..! ప్రజల ఆదరణకు ప్రతీకగా రికార్డు స్థాయిలో 75 లక్షల సభ్యత్వంతో టీఆర్‌ఎస్‌ పార్టీ జయపతాకాన్ని ఎగరవేస్తున్నది..! పార్టీ 16వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర శివారులోభారీ ఎత్తున ప్లీనరీని నిర్వహించుకుంటున్నది..! కొంపల్లిలోని తెలంగాణ ప్రగతి ప్రాంగణం ఈ పండగకు వేదికవనుంది..!

ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కాముక పథకాలు, పనులను ఈ సందర్భంగా క్యాడర్‌కు మరోసారి సీఎం కేసీఆర్ వివరిస్తారు. పార్టీ క్యాడర్‌ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను ప్రజల వద్దకు చేర్చేలా క్యాడర్‌ను ఉత్సాహపరుస్తారు. ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రతిపాదించి, ఆమోదిస్తారు. ఈ ప్లీనరీకి మొత్తం పదివేల మంది క్రియాశీల కార్యకర్తలు హాజరవుతున్నారు. ప్రతినిధులను ఎంపిక చేసి ఇప్పటికే పాస్‌లు అందజేశారు. పాస్‌లు ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. మొత్తం 25 వేల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ప్లీనరీ ప్రారంభానికి ముందు ఉదయం 9.55 గంటలకు తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్ కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి, పార్టీ సెక్రెటరీ జనరల్ కేకేతో కలిసి టీఆర్‌ఎస్‌ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. పార్టీ అధ్యక్ష పదవికి 11 నామినేషన్లు సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంపిక ఏకగ్రీవమైంది. ఈ అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ నాయిని నర్సింహ్మారెడ్డి అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడ అధ్యక్ష ఎన్నిక ప్రకటన పూర్తి కాగానే సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్ బయలుదేరి కొంపల్లిలోని తెలంగాణ ప్రగతి ప్రాంగణానికి చేరుకుంటారు.

ఇవాళ ఉదయం పదిన్నరకు ప్లీనరీ మొదలవుతుంది. మొదట అధినేత కేసీఆర్ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. తర్వాత ఆనవాయితీ ప్రకారం తెలంగాణ తల్లికి పుష్పాలు సమర్పించి… అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం ఎంపీ కేశవరావు లాంఛనంగా పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. హోం మంత్రి నాయినితో పాటు మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్లీనరీకి కొత్త అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. అమరుల వీరుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తారు. రాజ్యసభ సభ్యుడు కేకే తొలి ప్రసంగం చేస్తారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ప్లీనరీని ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం తర్వాత తీర్మానాలు ప్రవేశపెడ్తారు. ఒంటిగంటన్నరకు భోజన విరామం. గంట తర్వాత తిరిగి తీర్మానాలపై ప్రతినిధులు చర్చిస్తారు. సాయింత్రం ఐదు- ఐదున్నర మధ్యలో అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ముగింపు ఉపన్యాసంతో ప్లీనరీ పరిసమాప్తమవుతుంది.

టీఆర్‌ఎస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ ప్లీనరీకి గత వారం పది రోజులుగా నిర్విరామంగా ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా అహర్నిశలు కష్టపడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పది కమిటీలు వేసుకుని పని విభజన చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రుల పర్యవేక్షణలో సమన్వయంతో పని చేసి ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివస్తున్న పార్టీ క్యాడర్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పించారు. ఎండాకాలం కావడంతో లక్ష వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ బాటిళ్లు సిద్ధం చేశారు. 26 రకాల ఆహార పదార్థాలతో పసందైన భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అతిథి మర్యాదలకు లోటు లేకుండా 6 భోజన శాలలు ఏర్పాటు చేశారు. ప్రాంగణం మొత్తం 200 ఏసీలు నెలకొల్పారు. మొత్తం సభా ప్రాంగణం 60 ఎకరాల్లో వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. వారికి వాకీటాకీలు అందజేశారు. నగరంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అనుమతితో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దన్న మంత్రి కేటీఆర్ సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ప్లీనరీ జరిగే ప్రాంతం ముందు గేటు వద్ద, లోపల సీఎం కేసీఆర్ చిత్ర మాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.