పాతబస్తీలో అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ యువ‌త‌కు ఉన్న‌త ప్ర‌మాణాల‌ు క‌లిగిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. రూ. 7.17కోట్ల ఖర్చుతో జీహెచ్ఎంసీ మొగ‌ల్‌పుర‌లో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎంపీ అసదుద్దిన్ ఒవైసీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, డిప్యూటి మేయ‌ర్‌ బాబా ఫసియుద్దిన్, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

పాతబ‌స్తీలోని అతి పెద్ద‌దైన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా దాదాపు 400మంది విద్యార్థులు, యువ‌కులు వివిధ క్రీడ‌ల్లో శిక్ష‌ణ పొందేందుకు అవ‌కాశం ల‌భించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని యువ‌త‌లో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ రూ.33.28 కోట్ల ఖర్చుతో 11 ప్రాంతాల్లో క్రీడా సౌక‌ర్యాలను అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగానే రూ. 7.17 కోట్ల ఖర్చుతో మొగ‌ల్‌పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తిచేసింది.

15 క్రీడా విభాగాలు క‌లిగిన మొగ‌ల్‌పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రెండు అంత‌స్తుల్లో 1520 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మించారు.  సౌత్ జోన్ ప‌రిధిలో చందులాల్ బారాదరిలో ఉన్న ఇండోర్ స్టేడియం త‌ర్వాత మొగ‌ల్‌పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అతిపెద్దది. విశాల‌మైన పార్కింగ్ సౌక‌ర్యం, క్రీడా స‌దుపాయాలు క‌లిగిన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొద‌టి అంత‌స్తులో జిమ్‌, టేబుల్ టెన్నిస్‌, బాక్సింగ్‌, యోగా, జిమ్నాస్టిక్స్‌, క్యార‌మ్ క్రీడ‌ల‌కు ఏర్పాట్లు చేశారు. రెండ‌వ అంత‌స్తులో బాస్కెట్ బాల్‌, వాలీబాల్‌తో పాటు మూడు ష‌టిల్‌ బ్యాడ్మింట‌న్ కోర్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఔట్‌డోర్‌లో క్రికెట్‌, స్కేటింగ్‌, క‌రాటే, చిన్న పిల్ల‌ల ఆట వ‌స్తువులు ఉంచారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ. 9.58 ల‌క్ష‌ల‌తో క్రీడా ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేశారు.